యాదాద్రిలో యాలీ పిల్లర్లపై వైకుంఠ ద్వారం

Yadadri Galigopuram: Five Floor Vaikunta Dwaram in Yadagirigutta - Sakshi

యాదాద్రిలో ఆకట్టుకుంటున్న గాలిగోపురం

యాదగిరిగుట్ట: ప్రపంచస్థాయి పుణ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదం కలిగించే విధంగా వైటీడీఏ అధికారులు, శిల్పులు కృషి చేస్తున్నారు. యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తులు మొదటగా పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద మొక్కులు చెల్లించుకొని మెట్ల మార్గాన, ఘాట్‌ రోడ్డు గుండా కొండకు చేరుకునేవారు.

అయితే రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతన వైకుంఠ ద్వారాన్ని తొలగించిన అధికారులు.. నూతనంగా ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని (వైకుంఠద్వారం) అద్భుతంగా నిర్మించారు. ఈ ద్వారానికి రెండు వైపులా మెట్లు నిర్మించి భక్తులు కొండపైకి కాలినడకన వెళ్లేందుకు వీలు కల్పించారు. యాలీ పిల్లర్లపై వైకుంఠ ద్వారాన్ని నిర్మించడం భక్తులను ఆకట్టుకుంటోంది. యాలీ పిల్లర్లపై భాగంలో సింహాలు, పిల్లర్లకు ఐరావతాలు, నృసింహుడి అవతారాలను తీర్చిదిద్దారు. వీటితో పాటు శంకు, చక్ర, నామాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం)


ఆకట్టుకుంటున్న యాదాద్రి పచ్చందాలు

ఓ వైపు ఆధ్యాత్మిక రూపాలు.. మరోవైపు పచ్చని పచ్చందాలతో యాదాద్రీశుడి సన్నిధి అద్భుతంగా ముస్తాబవుతోంది. సీఎం కేసీఆర్‌ సూచనలు, సలహాలతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ అధికారులు పూల మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయానికి దక్షిణ దిశలో కొండ దిగువ భాగంలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా వివిధ రకాల మొక్కలతో లాన్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులు నడిచే విధంగా స్టోన్‌ ఫ్లోరింగ్‌ వేశారు. వీటి మధ్యలో సైతం గ్రీనరీ ఏర్పాటు చేయడంతో అద్భుంతంగా కనిపిస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top