‘మునుగోడు’లో ఓటర్‌ టర్నౌట్‌ యాప్‌ 

Voter Turnout App To Use In Munugode By Poll Election 2022 - Sakshi

ఉపఎన్నికలో రాష్ట్రంలో తొలిసారి వినియోగం 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు (రియల్‌ టైమ్‌లో) ప్రకటించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్‌ టర్నౌట్‌’ పేరుతో అభివృద్ధి చేసిన మొబైల్‌ యాప్‌ను రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో వినియోగించనుంది. సామాన్య ప్రజలు సైతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

యాప్‌ ఇలా పనిచేస్తుంది... 
నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ వివరాలను యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. యాప్‌లో ఎంట్రీల నమోదుకు 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఉదాహరణకు ఉదయం 9 గంటల్లోగా జరిగిన పోలింగ్‌ శాతం వివరాలను రిటర్నింగ్‌ అధికారి ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య నమోదు చేస్తారు. 

►ఉదయం 9 గంటలు, 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట, 3 గంటలు, సాయంత్రం 5 గంటలు, 7 గంటల వరకు జరిగిన పోలింగ్‌ వివరాలను ఆ తర్వాతి అర్ధగంటలోగా ప్రకటిస్తారు. తుది పోలింగ్‌ వివరాలను అర్ధరాత్రి 12 గంటలలోగా విడుదల చేస్తారు. 

►పోలింగ్‌ ముగిసిన తర్వాత పురుషులు, మహిళలు, ఇతర ఓటర్లు ఎంత మంది ఓటేశారు? మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? వంటి వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసి, ధ్రువీకరించుకున్న తర్వాత సబ్మిట్‌ చేస్తారు.  

►అనంతరం సీఈఓ నియోజకవర్గాల వారీగా వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకున్నాక వాటిని ప్రకటిస్తారు. పోలింగ్‌ ముగిసే సమయానికి సుమారుగా ఇంత పోలింగ్‌ జరిగిందని యాప్‌లో వివరాలు అందుబాటులోకి వస్తాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top