వినూత్న నిర్ణయం.. పోలీసులకు శాశ్వత ఫోన్‌ నంబర్లు

Telangana: Police Dept Introduces Permanent Mobile Number To Staff Members - Sakshi

కమ్యూనికేషన్‌లో ఎక్కడా ఇబ్బంది రావొద్దనే..

హెచ్‌ఆర్‌ఎంఎస్, బ్యాంకు, పీఎఫ్‌ ఖాతాలకు అనుసంధానం

55 వేల సిమ్‌కార్డుల కొనుగోలు.. ఇప్పటికే సగం మందికి పంపిణీ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పోలీసుశాఖ మరో వినూత్న నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. డిపార్ట్‌మెంటులో ప్రతి పోలీసు అధికారికి శాశ్వత సెల్‌ఫోన్‌ నెంబర్‌ను కేటాయించింది. ఇందుకోసం దాదాపు 55 వేల మంది సిమ్‌కార్డులను కొనుగోలు చేసింది. కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతోపాటు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర వింగ్స్‌ ప్రధాన కార్యాలయాలకు సిమ్‌కార్డులు చేరుకున్నాయి.

ఇప్పటికే సగానికిపైగా పోలీసు అధికారులు సిమ్‌కార్డులను పొందగా మిగిలిన సిబ్బందికి ఈ వారాంతంలోగా అందజేయనున్నారు. పోలీసుల విధి నిర్వహణలో ఎక్కడా కమ్యూనికేషన్‌లో ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతోనే పోలీసులందరికీ శాశ్వత సెల్‌ఫోన్‌ నంబర్లు ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్‌ ఇటీవల నిర్ణయించారు. 

ఏంటి లాభాలు? 
కానిస్టేబుల్‌ మొదలు డీజీపీ స్థాయి అధికారి  దాకా అందరికీ ఇస్తున్న శాశ్వత నంబర్లను వారి హెచ్‌ఆర్‌ఎంఎస్, బ్యాంకు ఖాతా, పీఎఫ్‌లకు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఇకపై వ్యక్తిగత నంబర్‌ను వాటికి అనుంసంధానించే బాధ తప్పుతుంది. విధుల్లో చేరిన తొలిరోజు నుంచి రిటైరయ్యే రోజు వరకు ఫోన్‌ నంబర్‌ ఉద్యోగితోనే ఉంటుంది. అదే సమయంలో ఉన్నతాధికారులు ఫలానా అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొనేందుకు అతని ఎంప్లాయ్‌ ఐడీ ద్వారా సులువుగా గుర్తించవచ్చు.

క్షణాల్లో అతని నంబర్‌ ఉన్నతాధికారి సెల్‌ఫోన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంటే ఏ అధికారి ఎక్కడ ఉన్నా.. వెంటనే అతనితో ఉన్నతాధికారులు సంప్రదించి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. అదే సమయంలో వారు స్టేషన్‌ లేదా వింగ్, టీములు మారినప్పుడు సంబంధిత ఫోన్‌ నంబర్‌ ఎలాగూ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఎస్సైకి డిపార్ట్‌మెంటు ఇచ్చే శాశ్వత నంబర్‌తోపాటు అతను పనిచేసే స్టేషన్‌లో ఎస్సైకి ఇచ్చే మరో నంబర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 

మారిన నెట్‌వర్క్‌.. 
పోలీసులను వేగవంతమైన నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు పోలీసు శాఖ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు మారింది. అది కూడా అత్యాధునిక 5జీ నెట్‌వర్క్‌తో. ఈ సిమ్‌ ఎంప్లాయి ఐడీతో వస్తుంది. ప్రతి అధికారికి రోజుకు 2 జీబీ, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు చేసుకునే సదుపాయం ఉంటుంది. తాము వాడే చాలా యాప్స్‌ డేటాను అధికంగా తీసుకుంటున్నాయని... 5జీకి మారాక యాప్స్‌ మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలను పసిగట్టే పోలీసులకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ అధికారిని ఆదేశించాలన్నా ఈ విధానం వల్ల క్షణాల్లో సంప్రదించడం సాధ్యం కానుందని చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top