కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు | Telangana High Court orders to State Govt On KCR, Harish Rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు

Apr 23 2026 2:01 AM | Updated on Apr 23 2026 2:01 AM

Telangana High Court orders to State Govt On KCR, Harish Rao

ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్‌పై కూడా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు  

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదికను ఆధారంగా తీసుకోవద్దు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

తీర్పు వెలువరించిన చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం 

నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్ధరహితం 

కమిషన్‌ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసింది 

విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదు 

అభియోగాలు మోపే ముందు వారి వాదనలు వినలేదు 

నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవన్న హైకోర్టు 

కమిషన్‌ ఏర్పాటు జీవో చట్టబద్ధమేనన్న ధర్మాసనం

కమిషన్‌ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది 

కమిషన్‌ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ సీఎస్‌ శైలేంద్రకుమార్‌ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్‌ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్‌ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్‌ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. 

ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్‌ గతేడాది జూన్‌ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్‌ ఘోష్‌ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీ¯న్‌ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 

1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం 
ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్‌ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్‌ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం.  

విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 
1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్‌ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది.  

కమిషన్‌ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. 
చట్టంలోని సెక్షన్‌ 3 (4) ప్రకారం.. కమిషన్‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్‌ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్‌ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్‌ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ని ఉల్లంఘించడం కాదు.  

నిర్లక్ష్యమే కారణమన్న ఎన్‌డీఎస్‌ఏ.. 
మేడిగడ్డ బరాజ్‌ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్‌ భద్రతా అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్‌ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్‌ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్‌ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్‌డీఎస్‌ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు.   

కమిషన్‌ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు 
కమిషన్‌ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్‌ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. 

వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు 
‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్‌కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు.  

సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. 
సెక్షన్‌ 8బీ కమిషన్‌పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్‌ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్‌ పార్టెమ్‌’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్‌ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్‌ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది.   

సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. 
కమిషన్‌ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్‌ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్‌ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. 

నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. 
ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్‌ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్‌ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్‌ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement