‘వ్యాగన్‌’కు మ్యుటేషన్‌ బ్రేక్‌!

Telangana Has Been Waiting For A Railway Project For 13 Years - Sakshi

కాజీపేట వర్క్‌షాపుపై రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయలోపం 

భూమిని అప్పగించామంటున్న రెవెన్యూ యంత్రాంగం 

మ్యుటేషన్‌ జరగకుంటే పనులు చేపట్టలేమంటున్న రైల్వే 

13 ఏళ్ల కోర్టు కేసు కొలిక్కి వచ్చినా.. ప్రారంభంకాని పనులు

సాక్షి, హైదరాబాద్‌: 
‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు భూమి అందలేదు. రైల్వే పేరిట భూమిని మ్యుటేషన్‌ చేసి ఇస్తేనే మేం పని ప్రారంభింస్తాం. అప్పటివరకు మాకు భూమి అందనట్టే లెక్క’–దక్షిణ మధ్య రైల్వే 

‘కోర్టు పరిధిలో ఉన్న కేసు కొలిక్కి రావటంతో జనవరిలోనే రైల్వేకు భూమిని అప్పగించాం. దాన్ని రైల్వే పేరిట మ్యుటేషన్‌ కోసం తహసీల్దారుకు ఇచ్చిన లేఖను రైల్వేకు అప్పగించాం. కానీ, రైల్వే యంత్రాంగమే పని ప్రారంభించటం లేదు’ 
–తెలంగాణ రెవెన్యూ యంత్రాంగం 

ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 13 ఏళ్లుగా ఓ రైల్వే ప్రాజెక్టు కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. అయితే ఆ ప్రాజెక్టుకు కేటాయించిన భూమి విషయమై వేసిన కేసు కోర్టులో నలిగి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత భూమి మ్యుటేషన్‌ అంశం అడ్డంకిగా మారింది.  

ఇదీ సంగతి... 
మమతాబెనర్జీ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాజీపేటకు వ్యాగన్‌ వీల్‌ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేటకు సమీపంలోని మడికొండ సీతారామస్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. తర్వాత ఈ భూమి కేటాయింపుపై కోర్టులో కేసు నమోదైంది. ఇంతలో ఆ ప్రాజెక్టు రద్దవడంతో దానిస్థానంలో వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాపును 2016లో రైల్వే శాఖ మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించినా, భూవివాదం కారణంగా ఆ నిధులు విడుదల కాలేదు.

ఎట్టకేలకు కోర్టు కేసు కొలిక్కి రావటంతో గత జనవరిలో 150 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రైల్వేకు అప్పగించారు. అయితే, ఆ భూమిని రైల్వే పిరియాడికల్‌ వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపు పేరుతో మ్యుటేషన్‌ చేయాలని, అలా భూమి తమ పేరుతో మారితేనే పనులు చేపట్టేందుకు తమ విధానాలు అంగీకరిస్తాయని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు.

దీంతోపాటు మరో 11 ఎకరాల భూమి కూడా కావాలని కోరగా, రెవెన్యూ అధికారులు పదెకరాలను కేటాయించారు. అయితే, మొత్తం భూమికి సంబంధించిన కాగితాలు ఇవ్వటంతోనే అప్పగింత ప్రక్రియ పూర్తయినట్టు రెవెన్యూ అధికారులు చెబుతుండగా, మ్యుటేషన్‌ జరగకపోవటం, ధరణి పోర్టల్‌ రైల్వే పేరు నమోదు కాకపోవటంతో పనులు ప్రారంభించలేమని రైల్వే అధికారులు మిన్నకుండిపోయారు.  

1,500 కుటుంబాలకు ఉపాధి 
1980లలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కృషితో కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరైంది. సరిగ్గా పనులు మొదలుపెట్టే తరుణంలో ఇందిరాగాంధీ హత్య, సిక్కుల ఊచకోత వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికిగాను ఆ రాష్ట్రంలోని కపుర్తలాకు ఈ కోచ్‌ఫ్యాక్టరీని బదలాయించారు.

తర్వాత రాష్ట్రవిభజన సమయంలో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏర్పడ్డ కమిటీ అది సాధ్యం కాదని తేల్చింది. ఈ క్రమంలో వర్క్‌షాపు మంజూరైంది. నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్‌హాలింగ్‌ చేయటం దీని పని. ఇందులో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా మరో వేయి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా ఉంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top