చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీపై రాష్ట్రం దృష్టి
ఈ ఏడాది కొత్త విధానం విడుదలకు సన్నాహాలు
ఈఎంసీలు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా ఏటా 5 వేల మందికి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేలా కొత్త విధానం రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 (ఐఎస్‌ఎం రెండో దశ)తో అనుసంధానం చేస్తూ కొత్త పాలసీ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. సెమీకండక్టర్ల రంగంలో తెలంగాణ స్వావలంబన సాధించడం లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని సమాచారం.
ఇన్నాళ్లూ చిప్‌లు, సెమీకండక్టర్ల రంగంలో ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్)కు పరిమితమైన స్థానిక తయారీ పరిశ్రమలను అధునాతన చిప్ డిజైన్ దిశగా మళ్లించేందుకు ఈ కొత్త పాలసీ దోహదపడుతుందని, కేంద్రం అమలు చేస్తున్న ఈఎంసీ, ఐఎస్‌ఎం పథకాల ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ పాలసీ రూపకల్పనకు సంబంధిత రంగాలకు చెందిన ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పాలసీ విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి.
ఫ్యూచర్ సిటీలో కొత్త ఈఎంసీ
పాలసీలో భాగంగా ప్రధానంగా కొత్త ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు (ఈఎంసీ), నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. హైదరాబాద్‌లో ‘సెమీకండక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ద్వారా ప్రతీ ఏటా ఐదు వేల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తారు. చిప్ డిజైన్, కృత్రిమ మేథస్సు (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో ఈ శిక్షణ ఉంటుంది.
కొత్త పాలసీలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త ఈఎంసీ ఏర్పాటుకు అనువైన 623 ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ అమలు చేస్తున్న ఎల్రక్టానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2.0 పథకం కింద ఏర్పాటయ్యే ఈఎంసీ ద్వారా తెలంగాణలో కొత్త తరం ఎల్రక్టానిక్స్ తయారీకి అవసరమైన పునాది ఏర్పడుతుందని పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) వర్గాలు చెప్తున్నాయి.
ఈఎంసీల అభివృద్ధిపై దృష్టి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మొదటి దశ (ఈఎంసీ 1.0)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇప్పటికే రెండు ఈఎంసీల అభివృద్ధిని ప్రతిపాదించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 310 ఎకరాల్లో రూ.437 కోట్ల వ్యయంతో ఒక ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందుకు కేంద్రం రూ.138.60 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.298 కోట్లు వెచ్చించనుంది.
మహేశ్వరం మండలం రావిర్యాలలోనూ 603 ఎకరాల్లో రాష్ట్రం ఈఎంసీని అభివృద్ధి చేస్తోంది. మొత్తం రూ.667 కోట్ల వ్యయం అంచనా వేయగా కేంద్రం రూ.252.41 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.415 కోట్లు వెచ్చించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్ర వాటాగా రూ.19.70 కోట్లు మంజూరు చేశారు. ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి (తాడిపర్తి) వద్ద ఈఎంసీ 2.0లో భాగంగా రూ.878 కోట్లవ్యయంతో కొత్త ఎలక్టానిక్ తయారీ క్లస్టర్ ఏర్పాటుకు టీజీఐఐసీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.


