అనూహ్యంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి 

telangana: Drop In Temperature Raises Concern Of Respiratory Illness - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గుముఖం పడుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. మరోవైపు వాహన కాలుష్యం అనూహ్యంగా పెరుగుతుండడంతో సిటీజన్లు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారంలో పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు చేరుకోవడంతో నగరవాసులు గజగజలాడారు. నగరంలో కాలుష్యం,చలి కారణంగా రోగులు, వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు, ప్రయాణికులు, వాహనదారులు, చిరు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. చలి, కాలుష్య తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు  సూచిస్తున్నారు. 

వాహన కాలుష్య ఉద్గారాలు..   
గ్రేటర్‌లో వాహనాలు వదులుతున్న కాలుష్యంతో భూస్థాయి ఓజోన్‌ మోతాదు క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్‌ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్‌ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్‌ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్‌ వాయువు గాలిలోని నైట్రోజన్‌ ఆక్సైడ్స్, ఓలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్‌లతో కలవడంతో పాటు మంచు, సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్‌ దట్టంగా ఆవహిస్తోంది.

దీంతో ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్‌ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్‌ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. 


 
వాయు కాలుష్యంతో..  
► పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. 
►దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. 
►చిరాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు తలనొప్పి, పార్శ్వపు నొప్పి వస్తుంటాయి.  
►ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. 

పంజా విసురుతున్న చలిపులి..  
నగరంలో ఇటీవలికాలంలో కనిష్ట,గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో చలిపంజా విసురుతోంది. కిందిస్థాయి గాలుల ప్రభావంతో తరచూ కారుమబ్బులు కమ్ముకుంటుండడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల మేర నమోదవడంతో సిటీజన్లు గజగజలాడారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top