సంబురాల నుంచి... ఎన్నికల సమరానికి

Telangana BJP HIgh Focus On Munugode Bypoll Elections 2022 - Sakshi

మునుగోడు ఉప ఎన్నికపై దూకుడు పెంచనున్న బీజేపీ

ప్రాంతాలు, కాలనీలు వారీగా పార్టీ నేతల మోహరింపు

ప్రతి ఒక్క ఓటరునూ కలుసుకునే విధంగా ప్రణాళిక

10 రోజుల పాటు నియోజకవర్గంలోనే సంజయ్‌ మకాం!

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడులో ఎన్నికల ప్రచారం, ఇతర బాధ్యతలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఆదేశాలతో పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రికల్లా తమ తమ కార్యస్థానాలకు చేరుకున్నారు. దసరా వేడుకలు ముగియడంతో తమ అప్పగించిన ప్రాంతాల్లో మెజారిటీ నాయకులు బస చేశారు. శుక్రవారం నుంచి నేతలు తమకు అప్పగించిన విధులు, బాధ్యతల్లో నిమగ్నం కానున్నట్టు పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు.

ఈ నియోజకవర్గంలోని 298 పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ప్రతి ఒక్క ఓటరును కలుసుకునే విధంగా నాయకత్వం రూపొందించిన కార్యాచరణ అమలుకు నేతలు సిద్ధమౌతున్నారు. వివిధ సామాజికవర్గాల ఓట్లు రాబట్టేందుకు వీలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 7 మండలాల (కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్‌తో సహా) ఇన్‌చార్జిలు, సహ ఇన్‌చార్జిలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని కాలనీలు, ప్రాంతాల్లో మోహరించనున్నారు.

ఇంటింటికీ వెళ్లి మద్దతు కూడగట్టేలా వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా పెద్ద పెద్ద సభల కంటే చిన్న చిన్న సమావేశాలకే ప్రాధాన్యమివ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగ సభ ఉంటుందని పార్టీవర్గాలు వెల్లడించాయి. మరోవైపు బండి సంజయ్‌ 10 రోజుల పాటు మునుగోడులోనే బస చేయనున్నట్టు తెలిపాయి.

బైక్‌ ర్యాలీలు వాయిదా
రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం నుంచి చేపట్టాల్సిన బైక్‌ ర్యాలీలను ఆదివారానికి వాయిదా వేశారు. మునుగోడు మొత్తం చుట్టివచ్చేలా ఈ మోటార్‌ బైక్‌ ర్యాలీలకు రూపకల్పన చేశారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో నిర్వహించాల్సిన మునుగోడు ఎన్నికల సన్నాహక భేటీ కూడా సోమవారానికి వాయిదా పడింది. 

మునుగోడుపై సంఘ్‌ సమీక్ష
గురువారం సాయంత్రం మునుగోడుపై సంఘ్‌ పరివార్‌ సమీక్ష నిర్వహించింది. బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ ఎన్నికను బీజేపీతో పాటు సంఘ్‌ పరివార్‌ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు పరివార్‌ క్షేత్రాల కార్యకర్తలు సిద్ధమైనట్టు సమాచారం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top