ఆహారా భద్రతకార్డు.. ఇకపై పేదలకు మాత్రమే..  | Sakshi
Sakshi News home page

ఆహారా భద్రతకార్డు.. ఇకపై పేదలకు మాత్రమే.. 

Published Mon, Jun 21 2021 8:09 AM

Ration Card Application Starts In Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో : ఆహారభద్రతా కార్డుల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో సోమవారం నుంచి పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్‌ సహా రంగారెడ్డి, మేడ్చల్‌  జిల్లాల్లో  దాదాపు 2.80 లక్షల మంది నిరుపేదలు ఆహార భద్రతా  కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం  కొత్త కార్డుల జారీకి నిర్ణయం తీసుకోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలనకు సన్నాహాలు చేపట్టారు. 

ఇందుకుగాను రెవెన్యూ, విద్యా, కో–ఆపరేటివ్, సివిల్‌ సప్లయ్‌ శాఖలకు చెందిన సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పది రోజుల్లో విచారణ పూర్తి చేయడమేగాక దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక్క మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోనే 99,854 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని విచారించేందుకు 111 బృందాలను రంగంలోకి దింపనున్నారు. దరఖాస్తుదారుల ఇళ్ల చిరునామాల ఆధారంగా ఆయా బృందాలు సమగ్ర విచారణ చేపట్టనున్నాయి. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు, కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి తదితర అంశాలను పరిశీలించనున్నారు.  విచారణ అనంతరం ఆయా వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం అర్హులందరికీ కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేయటంతోపాటు రేషన్‌ కోటా విడుదలకు పౌరసరఫరాల శాఖ  చర్యలు తీసుకుంటోంది.   

‘యాప్‌’లో సమగ్ర సమాచారం 
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కొత్త ఆహార భద్రతా  కార్డులను  జారీ చేసే ప్రక్రియలో భాగంగా  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ‘ప్రత్యేక యాప్‌’ను  వినియోగించనున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ యాప్‌ను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయడంతో గతంలో ఆహార భద్రతా  కార్డులు పొందిన వారు,  దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తెలుస్తాయన్నారు. 

అర్హతలివీ...  
దరిద్రరేఖకు దిగువన (బీపీఎల్‌)ఉన్న వారికి మాత్రమే ఆహార భద్రతా కార్డులను జారీ చేయనున్నారు. పట్టణంలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు మాత్రమే ఆహర భద్రతా కార్డులకు  అర్హులుగా పేర్కొన్నారు. ఫోర్‌ వీలర్‌ ఉన్న వారినిS అనర్హులుగా పేర్కొంది. 

111 బృందాలతో దరఖాస్తుల పరిశీలన  
కొత్త ఆహారభద్రతా కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా  పెండింగ్‌ దరఖాస్తుల విచారణకు  మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 111 టీమ్‌లు ఏర్పాటు చేశాం. ఆయా బృందాలు సోమవారం నుంచి పది రోజుల పాటు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి  విచారణ నిర్వహిస్తారు. ఆ తర్వాత వాటిని అప్‌లోడ్‌ చేస్తారు.దీని ఆధారంగా అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తాం.   –పద్మ ,డీఎస్‌ఓ ,మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లా 

Advertisement
Advertisement