Hyderabad: మట్టి  ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు

Prakriti Ganapati Under The Badhyata Foundation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజుల్లో  ప్రారంభం కానున్న వినాయకచవితి వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మండపాల్లో  కొలువుదీరేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలపై ఆంక్షలు తొలగిపోవడంతో విగ్రహాల అమ్మకాలు మొదలయ్యాయి. మరోవైపు పర్యావరణహితమైన మట్టి ప్రతిమలకే నగరం పట్టం కడుతోంది.

ముఖ్యంగా ఇళ్లల్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేందుకు నగర వాసులు ఒక అడుగు నుంచి అయిదడుగుల మట్టి విగ్రహాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్‌ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమల పంపిణీకి సన్నాహాలు చేపట్టాయి.  

సుమారు 6 లక్షల విగ్రహాలు.. 
ఈ ఏడాది సుమారు 6 లక్షల విగ్రహాలకు డిమాండ్‌ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్‌ సంస్థలు తయారు చేసే మట్టి విగ్రహాలకు సైతం డిమాండ్‌ భారీగా ఉండనుంది. ‘ప్లాన్‌ ఏ ప్లాంట్‌’ వంటి సంస్థలు మొలకెత్తే  విగ్రహాలను అందజేస్తుండగా మరి కొన్ని  సంస్థలు ఆర్గానిక్‌  పద్ధతిలో తయారు చేసిన ప్రకృతి ప్రతిమలను అందుబాటులోకి తెచ్చాయి. ‘బాధ్యత ఫౌండేషన్‌’ అనే సంస్థ స్వచ్ఛమైన పల్లె మట్టితో చేసిన వినాయక ప్రతిమలను, సేంద్రీయ పద్ధతిలో సిద్ధం చేసిన పూజా ద్రవ్యాలను అందజేస్తోంది.

ఈ మట్టి విగ్రహంతో పాటే విత్తనాలు కూడా ఉంటాయి. వేడుకలు పూర్తయ్యే నాటికి మొక్కలై ఎదుగుతాయి. ప్రకృతిని ఆరాధించడమే దైవంగా భావిస్తూ గత 8 ఏళ్లుగా ఏఎస్‌రావునగర్‌ కేంద్రంగా ప్రకృతి వినాయకుడి ప్రతిమలను భక్తులకు అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌  తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు, బ్రిటన్, అమెరికా, మలేషియా, తదితర దేశాలకు సైతం పెద్ద ఎత్తున విగ్రహాలను పంపించినట్లు  పేర్కొన్నారు.

పల్లెల్లోంచి నగరానికి.. 
బాధ్యత ఫౌండేషన్‌ అందజేసే గణపతి కిట్‌లు అన్నీ  పూర్తిగా పల్లెల నుంచి సేకరించినవే. పల్లెల్లోని చెరువు మట్టి నుంచి ఈ ప్రతిమలను తయారు చేస్తారు. ఈ ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత  పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్‌లను అందుబాటులోకి తెచ్చారు.

60 పేజీల వినాయక పూజా పుస్తకాన్ని అందజేస్తారు. పదకొండు రోజుల పాటు పూజలకు అవసరమయ్యే వివిధ రకాల వస్తువులు ఉంటాయి. తేనె, ఆవుపాలు, ఆకుల డొప్పలు, ఖర్జూర వంటివి కూడా ఈ కిట్‌లో ఉంటాయి. పల్లెల్లోని చేతి వృత్తులను కాపాడేందుకు సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ప్రతిమలకు శ్రీకారం చుట్టినట్లు చంద్రశేఖర్‌ తెలిపారు.  

(చదవండి: ప్రీలాంచ్‌ మాయ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top