తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు!

NIA Raids Activists In Andhra Telangana For Alleged Maoist Links - Sakshi

పౌర హక్కుల నేతలు, న్యాయవాదులు, 

మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు 

హైదరాబాద్‌తోపాటు ఏపీలోని పలుచోట్ల ఏకకాలంలో దాడులు

హైదరాబాద్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పౌర హక్కుల సంఘాల నేతలు, పలువురు న్యాయవాదులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్‌ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి సెల్‌ఫోన్లు, పలు పుస్తకాలు, విప్లవ గీతాల సీడీలు, డీవీడీలు, హార్ట్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, కేరళ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్‌ఐఏ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, జవహర్‌నగర్‌లో నివసించే పలువురు పౌరహక్కుల సంఘం న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలపై  ఏకకాలంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని కోదండరాం నగర్‌లో నివసించే రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు, న్యాయవాది వి.రఘునాథ్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి పొద్దుపోయేదాకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సంతోష్‌నగర్‌లో ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక గుడిమల్కాపూర్‌ తాళ్లగడ్డ బస్టాప్‌ సమీపంలోని ఒక ఇంటి వద్దకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. ఆ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారిని విచారించారు. ఎక్కడా కూడా మీడియాను అనుమతించలేదు. అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ 1967 ప్రకారం అధికారులు ఈ సోదాలు చేసినట్టు తెలుస్తోంది.  

ఏపీలోనూ సోదాలు.. 
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది చిలుకా చంద్రశేఖర్‌ ఇంట్లో ఎన్‌ఐఏ బృందం తనిఖీలు జరిపింది. అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రభునగర్‌లో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజేశ్వరి నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.రాజేశ్వరితో పాటు లా చదువుతున్న ఆమె కుమార్తెను, వైజాగ్‌లో చదువుతున్న ఆమె కుమారుడిని సైతం ఎన్‌ఐఏ బృందం విడివిడిగా ప్రశ్నించింది. కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కారు, ద్విచక్ర వాహనాలు, చెప్పుల స్టాండును సైతం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాజమహేంద్రవరంలోని ఉంటున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు ఇంట్లోనూ బుధవారం రాత్రి సోదాలు జరిగాయి. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో విప్లవ రచయితల సంఘం (విరసం) మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.  

న్యాయవాదుల ఇళ్లలో సోదాలు 
విశాఖ నగరంలోని ముగ్గురు న్యాయవాదుల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. పిఠాపురం కాలనీ కళా భారతి సమీపంలోని న్యాయవాది, సీఆర్‌పీపీ ప్రతినిధి కె.పద్మ ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించినట్టు సమాచారం. చినవాల్తేరులో న్యాయవాది కె.శివాచలం, హెచ్‌బీ కాలనీలో న్యాయవాది బాలకృష్ణ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. నగరంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న విప్లవ రచయితల సంఘం నాయకుడు దివంగత చలసాని ప్రసాద్‌ ఇంటి వద్ద కూడా ఎన్‌ఐఏ పోలీసులు భారీగా మోహరించారు. న్యాయవాది బాలకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి ఏ క్షణమైనా ఈ ముగ్గుర్నీ అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కర్నూలు నగరం శ్రీలక్ష్మీ నగర్‌లో ఉంటున్న విరసం సభ్యుడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. 

విశాఖ కేసు ఆధారాలతోనే.. 
విశాఖ ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్చి 7వ తేదీన విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న పాంగి నాగన్న అనే జర్నలిస్టును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద మావోయిస్ట్‌ విప్లవ సాహిత్యం, ప్రెస్‌నోట్లు, వైర్లు, మరికొంత సామగ్రి లభించాయి. అతన్ని విచారించగా మావోయిస్టుల కోసం పనిచేస్తున్నట్టు అంగీకరించాడని ఎన్‌ఐఏ తెలిపింది. జర్నలిస్టుగా పని చేస్తూ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ కోసం వెళ్తున్న పోలీసులను అడ్డుకునేలా గ్రామస్తులను రెచ్చగొట్టాడని పేర్కొన్నారు. అతనిచ్చిన సమాచారంతో దాదాపు 64 మంది అనుమానితుల జాబితాను ఎన్‌ఐఏ రూపొందించింది. ఇప్పుడు ఆ జాబితాలోని అనుమానితుల ఇళ్లల్లోనే సోదాలు నడుస్తుండటం విశేషం.  

ప్రజా గొంతుక నొక్కడమే  
పౌర హక్కుల నేతల ఇళ్లపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు నిర్వహించడాన్ని ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తీవ్రంగా ఖండించారు. తమపై ముందే కేసులు పెట్టి ఇపుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల గొంతు నొక్కే ప్రయత్నమని ధ్వజమెత్తారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కూడా ఈ సోదాలను ఖండించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top