కుట్రలు కూలిపోయాయి | KTR Sensational Comments on High Court Verdict | Sakshi
Sakshi News home page

కుట్రలు కూలిపోయాయి

Apr 23 2026 1:37 AM | Updated on Apr 23 2026 1:39 AM

KTR Sensational Comments on High Court Verdict

తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది 

రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చింది 

ఘోష్‌ కమిషన్‌ ట్రాష్‌ కమిషన్‌ అని తేలిపోయింది 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, భూమిపై గోదావరి నది పారినంత కాలం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్‌ పేరు నిలిచి ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. అభాండాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, రాహుల్‌గాందీని మేడిగడ్డకు తెచ్చి సీఎం రేవంత్‌ గోబెల్స్‌ను మించి చిల్లర ప్రచారం చేసినా రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌పై చేసిన కుట్రలు, కుతంత్రాలు కోర్టు తీర్పుతో కూలిపోయాయన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  

పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది.. 
‘కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యాన్ని కనిపించకుండా చేయాలనే కుట్రలు వీగిపోయాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడిన వారి గూబ గుయ్యిమంది. నిజం బయట పడింది. ఘోష్‌ కమిషన్‌ ట్రాష్‌ (చెత్త) కమిషన్‌ అని తేలిపోయింది. మేము గతం నుంచీ చెప్తున్నట్లుగానే ఇది పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది. కోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకుని చిల్లర ప్రచారం ఆపి మేడిగడ్డ బరాజ్‌కి మరమ్మతులు చేయాలి. నటించడం మానుకుని నీటిని ఎత్తిపోయాలి. 

మేడిగడ్డ పేల్చివేతపై విచారణ జరపాలి 
మేడిగడ్డ బరాజ్‌ పేల్చివేతపై నెలకొన్న అనుమానాల విష­యంలో బీజేపీ స్వతంత్ర విచారణ జరపాలి. నిక్షేపంగా ఉన్న బరాజ్‌ పిల్లర్లు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలా కూలిపోయాయో తేలాల్సి ఉంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఆగమేఘాల మీద స్పందించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ).. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం ఘట­న, సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలడం, చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై స్పందించకుండా ఎక్కడ చచ్చింది? కేసీఆర్‌ మీద కక్షతో రెండున్నరేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతు చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు. 

ఇప్పటికైనా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో కారుకూతలు, బూతులకు స్వస్తి చెప్పి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి. రేవంత్‌ ఇకనైనా గాసిప్స్‌ మీద కాకుండా గవర్నెన్స్‌ మీద దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్‌ హితవు పలికారు. ఘోష్‌ కమిషన్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు వృథా చేసిందని, సుప్రీంకోర్టులో ఏదో చేస్తామని ప్రభుత్వం అనుకోవడం వృథా ప్రయాస అని పేర్కొన్నారు.  

కాంగ్రెస్, బీజేపీ జాయింట్‌ వెంచర్‌ సర్కార్‌ 
‘పగలు కాంగ్రెస్‌తో ఉంటూ రాత్రి బీజేపీతో అంటకాగుతున్న రేవంత్‌రెడ్డి ఒక హైబ్రిడ్‌ సీఎం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వం నడుస్తోంది. చీకటి, దొంగ ఒకటి అయినట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఒక్కసారి కూడా రేవంత్‌ను విమర్శించడం లేదు. కాంగ్రెస్‌ పెద్దలకు రాష్ట్రం నుంచి మూటలు వెళ్తుంటే, సంజయ్‌ స్పందించకుండా కరీంనగర్‌ కార్పొరేటర్‌లా మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి అక్రమాలకు రక్షణ గోడలా నిలుస్తున్నాడు. అమృత్‌ స్కీమ్, సింగరేణి కుంభకోణాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు విచారణ జరపడం లేదు?  

రేవంత్‌ను ఎవరు కాపాడుతున్నారు? 
కెమెరాలకు చిక్కిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌లా రేవంత్‌ కూడా ఓటుకు నోటు కేసులో కెమెరాలకు చిక్కాడు. అయినా ఆయనను ఎవరు కాపాడుతున్నారో బీజేపీ నేతలు చెప్పాలి. రేవంత్‌ భవిష్యత్తులో కాంగ్రెస్‌ను బొందపెట్టి బీజేపీలో చేరడం ఖాయం..’అని కేటీఆర్‌ అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్‌ఎస్‌ నైతిక మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement