Hyderabad: గబ్బు చేస్తున్న పబ్బులు

Hyderabad Pubs To Go Silent After 10 PM - Sakshi

హైదరాబాద్ (బంజారాహిల్స్‌): తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్న రీతిలో లైసెన్స్‌లు జారీ చేసి ఎక్సైజ్‌ శాఖ చేతులు దులుపుకుంది. అక్రమ నిర్మాణలైనా.. నివాసిత ప్రాంతంలోనైనా మా వాటాలు అందితే చాలు ట్రేడ్‌ లైసెన్స్‌లు జారీ చేసి జీహెచ్‌ఎంసీ పక్కకు తొలగింది. జనం ఫిర్యాదులు చేస్తున్నా సరే పెట్టీ కేసులు వేసి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. పోలీసులు. నివాసిత ప్రాంతాల్లో పబ్‌లలో అర్ధరాత్రి శబ్దకాలుష్యంతో నరకాన్ని చూస్తున్న సీనియర్‌ సిటిజన్లు పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ నెట్టుకొచ్చారు.

అయినా సరే గత 12 సంవత్సరాలుగా పబ్‌ల వల్ల న్యూసెన్స్‌ పెరగడమే కానీ తగ్గుముఖం పట్టలేదు. అటు ఎక్సైజ్‌ పోలీసులు, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు, మరో వైపు లా ఆండ్‌ ఆర్డర్‌ పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో ఇక లాభం లేదనుకున్న బాధిత నివాసితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీళ్లందరినీ నమ్ముకుంటే ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన సూర్యదేవర వెంకట రమణ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గతేడాది నవంబర్‌లో శాస్త్రీయ ఆధారాలతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు పబ్‌లపై కొరడా ఝులిపించింది. ఇష్టానుసారంగా సౌండ్‌ పెట్టుకుంటామంటే కుదరదని అందుకు తగిన గడువును నిర్దేశించి హైకోర్టు మార్గదర్శకాలు రాగానే చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టేందుకు యతి్నస్తున్నారు.  

ఫిర్యాదు చేసినా స్పందన కరువు..
► జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 28, బంజారాహిల్స్‌ పరిధిలో నాలుగు, పంజగుట్ట పోలీస్‌ పరిధిలో నాలుగు పబ్‌లు ఉన్నాయి. 

►   ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యంతో పాటు ఇతరత్రా న్యూసెన్స్‌తో నివాసితులు నరకాన్ని చవి చూస్తున్నారు. 

►   జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని స్రవంతి నగర్‌లో ఉన్న టాట్‌పబ్‌కు జీరో పార్కింగ్‌ ఉంది, అర్ధరాత్రి మందుబాబులు తూలుతు మద్యం మత్తులో స్థానిక నివాసాల్లోకి చొచ్చుకెళ్తున్నారు. అక్కడే వాంతులు, మలమూత్ర విసర్జనలు చేస్తుండటంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న మహిళలకు ఇబ్బందిగా మారింది. 

►  ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకునేవారు. దీంతో స్రవంతి నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తరపున బి.సుభారెడ్డి జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సొసైటీ తరఫున సూర్యదేవర వెంకటరమణ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయమూర్తి స్పందించి తగిన ఆదేశాలు జారీ చేశారు.   

నివాసిత ప్రాంతాల్లోనే..
►   పబ్‌లు నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ఎక్సైజ్‌ అధికారుల పుణ్యమా అని ఇళ్లల్లోనే పబ్‌లు కొనసాగుతున్నాయి.  
►   జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 56లోని ఫర్జీ, అబ్జార్బ్‌ పబ్‌లు పూర్తిగా నివాసాల మధ్యనే ఉన్నాయి. టాట్‌ పబ్‌ స్రవంతినగర్‌లో ఉంది. 
►    అమ్నేయా లాంజ్‌బార్, బ్రాడ్‌వే, మాకోబ్రూ, హాట్‌కప్‌ డరి్టమారి్టని ఇలా పబ్‌లన్నీ నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  
►   ప్రతిరోజూ స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా జరిమానాలు చెల్లిస్తూ జారుకుంటున్నారు.  
►    జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం. 36, 45లలో మాత్రమే కమర్షియల్‌ వ్యాపారాలు జరగాల్సి ఉండగా మిగతా అన్ని చోట్లా నివాసిత ప్రాంతాల్లోనే పబ్‌లు కొనసాగుతున్నాయి.

నార్మల్‌ బార్‌కు ఇచ్చినట్లుగానే..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట ప్రాంతాల్లో ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేకంగా పబ్‌ పేరుతో లైసెన్స్‌ ఇవ్వడం లేదు. నార్మల్‌ బార్‌ లైసెన్స్‌ 2(బి) ప్రకారమే ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.  దీంతో ఇష్టానుసారంగా పబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top