సుమారు రూ.195 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ

HYD: RTC Lost About Rs 195 Crore In Revenue Due To Bus Passes - Sakshi

సాధారణ రోజుల్లో రోజుకు రూ.65 లక్షల వరకు ఆదాయం

గడిచిన 15 నెలల్లో కేవలం 3 నెలలే  పాస్‌ల వినియోగం

ఆన్‌లైన్‌ క్లాస్‌లతో విద్యార్ధులు, సొంత వాహనాలతో ఉద్యోగులు

ఆర్టీసీ ధృవీకరణకు సుమారు 2000 విద్యా సంస్థలు వెనుకంజ

‘మూడో ముప్పు’ ఉంటే ఈ ఏడాది మరిన్ని నష్టాలే... 

సాక్షి, హైదరాబాద్‌: జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా సరే బస్‌పాస్‌ ఉంటే చాలు సిటీ అంతా చుట్టేసి రావచ్చు. సగటు ప్రయాణికుడికి అదొక ధీమా. నెలంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా వెళ్లొచ్చు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, కార్మికులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు ఒకప్పుడు బస్‌పాస్‌ల కోసం కౌంటర్ల వద్ద గంటలతరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. మరోవైపు ఆర్టీసీకి సైతం బస్‌పాస్‌లపైనే ఎక్కువ ఆదాయం లభించేది. కానీ కోవిడ్‌ కారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో పాస్‌ల వినియోగం గణనీయంగా తగ్గింది. ఆర్టీసీ ఆదాయం కూడా దారుణంగా పడిపోయింది.

గతంలో రోజుకు రూ.65 లక్షలకు పైగా ఆదాయం లభిస్తే ఇప్పుడు రూ.15 లక్షలు కూడా లభించడం లేదు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది  ఫిబ్రవరి వరకు అంటే మూడు నెలలు మినహా ఈ మొత్తం కోవిడ్‌ కాలంలో ఒక్క బస్‌పాస్‌లపైన సుమారు రూ.195 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ‘జూలై నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. సాధారణ ప్రయాణికులు,ఎన్జీవోలు బస్‌పాస్‌లను కొనుగోలు చేస్తున్నారు. కానీ మూడో దశ వస్తే మాత్రం మరిన్ని నష్టాలు తప్పకపోవచ్చు’ అని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 

బస్సెక్కని స్టూడెంట్‌.. 
సాధారణంగా ఉదయం, సాయంత్రం సిటీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ప్రత్యేకించి నగర శివార్లలోని విద్యాసంస్థలకు వేలాది మంది విద్యార్ధులు రాకపోకలు సాగించేవారు. విద్యార్ధుల కోసమే గ్రేటర్‌ ఆర్టీసీ ప్రతి రోజు 2500 పైగా ప్రత్యేక ట్రిప్పులు నడిపేది. ఇప్పుడు ఈ విద్యార్ధలంతా ఆన్‌లైన్‌ చదువులకు పరిమితమయ్యారు. సుమారు 1000కి పైగా విద్యాసంస్థలు ఆర్టీసీ గుర్తింపును పునరుద్ధరించుకోకపోవడం గమనార్హం.  అలాగే  ఆరీ్టసీకి ఉన్న అతిపెద్ద ‘ప్యాసింజర్‌ బ్యాంక్‌’పరిశ్రమల్లో పని చేసే కారి్మకులు, ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే చిరుద్యోగులు. కరోనా కారణంగా చాలామంది సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్టీసీ బస్సులను పెద్దగా వినయోగించడం లేదు. ఎన్జీఓ బస్‌పాస్‌లకు ఇప్పుడిపుడే తిరిగి డిమాండ్‌ కనిపిస్తోంది.  

25 శాతానికి పడిపోయిన పాస్‌లు... 
కోవిడ్‌ కారణంగా సుమారు 5 లక్షలకు పైగా విద్యార్థుల బస్‌పాస్‌లు, మరో 3 లక్షల సాధారణ బస్‌పాస్‌లు నిలిచిపోయాయి. గత సంవత్సరం లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం సిటీ బస్సుల సేవలను పునరుద్ధరించినప్పటికీ  అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో రోజుకు  కేవలం రూ.లక్ష మాత్రమే ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. బస్‌పాస్‌ల ఆదాయం యథావిధిగా సుమారు రూ.60 లక్షలకు చేరుకుంది. మరోసారి మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో విరుచుకుపడడంతో మార్చి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 25 శాతానికి సాధారణ బస్‌పాస్‌ల వినియోగం పరిమితమైంది. అంటే రోజుకు రూ.15లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మాత్రమే లభిస్తుంది. విద్యార్థులు వినియోగించే అన్ని రకాల పాస్‌ల వినియోగం గణనీయంగా తగ్గింది.

ఇదీ లెక్క 
► మొత్తం బస్‌పాస్‌లు : 10 లక్షలు 
► స్టూడెంట్‌ పాస్‌లు : 6 లక్షలు 
► సాధారణ బస్‌పాస్‌లు : 3.5 లక్షలు 
► ​​​​​​​ఎన్జీవోపాస్‌లు : 20 ,000 
► ​​​​​​​జర్నలిస్టు పాస్‌లు : 10,000 
► ​​​​​​​దివ్యాంగుల పాస్‌లు : 20,000 
► ​​​​​​​జీబీటీ : రూ.950 ఆర్డినరీ, 
► ​​​​​​​మెట్రో పాస్‌ : రూ.1070 
► ​​​​​​​స్టూడెంట్‌ పాస్‌ :రూ.165 
► ​​​​​​​ఎన్జీవో పాస్‌ : రూ.360

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top