గ్రామీణం.. గురుకులం | Girls outshine boys in Telangana intermediate exams | Sakshi
Sakshi News home page

గ్రామీణం.. గురుకులం

Apr 13 2026 6:22 AM | Updated on Apr 13 2026 10:23 PM

Girls outshine boys in Telangana intermediate exams

ఇంటర్మిడియెట్‌ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు

ఫస్టియర్‌లో మొదటి స్థానంలో మేడ్చల్‌ 

సెకెండియర్‌లో తొలి 3 స్థానాల్లో గ్రామీణ జిల్లాలు భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్‌ విద్యార్థుల ప్రతిభ 

గురుకుల విద్యాసంస్థల్లో అత్యుత్తమ ఫలితాలు 

ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ పరిధిలోని కాలేజీలు  

ఫస్టియర్‌లో 92.73%, సెకెండియర్‌లో 94.03% ఉత్తీర్ణత 

ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి 

బాలుర ఉత్తీర్ణత 62.64%..  బాలికలు 78.13% 

మొత్తంగా 70.60% ఉత్తీర్ణత నమోదు

సాక్షి, హైదరాబాద్‌:     ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఈసారి అత్యంత గ్రామీణ నేపథ్యమున్న జిల్లాలు సత్తా చాటాయి. మరోవైపు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌) సొసైటీ పరిధిలోని జూనియర్‌ కాలేజీలు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. ఆదివారం ఇంటర్మిడియెట్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంయుక్తంగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.

ఫస్టియర్, సెకెండియర్‌ నుంచి మొత్తం 9,43,055 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా..వీరిలో 6,65,791 మంది (70.60%) ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,84,537 మంది బాలికలకు గాను 3,78,554 మంది (78.13%) ఉత్తీర్ణులవగా.. మొత్తం 4,58,518 మంది బాలురకు గాను 2,87,236 మంది (62.64%) ఉత్తీర్ణులయ్యారు. అంటే బాలికలు 15.49% అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నమాట. గతే డాది మొత్తం ఉత్తీర్ణత 65.81% నమోదు కాగా... ఈసారి 4.79% పెరిగి 70.60% నమోదైంది. 

ఫస్ట్, సెకెండియర్‌లో ఇలా.. 
ఫస్టియర్‌లో 2,49,110 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,85,331 మంది (74.40) ఉత్తీర్ణులయ్యారు. 2,40,013 మంది బాలురకు గాను 1,38,475 మంది పాసై 57.69% ఉత్తీర్ణత నమోదు చేశారు. సెకెండియర్‌లో 2,35,427 మంది బాలికలు హాజరు కాగా 1,93,223 (82.07%) మంది పాసయ్యారు. 2,18,505 మంది బాలురకు గాను 1,48,761 (68.08%) మంది పాసయ్యారు.  

అట్టడుగున మహబూబాబాద్,  సిరిసిల్ల జిల్లాలు
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా..సెకెండియర్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌ టాప్‌ మూడు జిల్లాలుగా మేడ్చల్, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాలు నిలవగా..విద్యార్థులు డిగ్రీలో ప్రవేశించేందుకు కీలకమైన సెకెండియర్‌లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్‌ జిల్లాలు విజయభేరి మోగించి ముందువరుసలో నిలవడం గమనార్హం. కాగా ఫస్టియర్‌లో 48.10% ఉత్తీర్ణతతో మహబూబాబాద్‌ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉండగా, సెకెండియర్‌లో 55.68% ఉత్తీర్ణతతో రాజన్న సిరిసిల్ల జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. 

టీఎస్‌ఆర్‌జేసీ టాప్‌ 
ఇంటర్‌ పరీక్షల్లో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని జూనియర్‌ కాలేజీలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. సొసైటీ పరిధిలో మొత్తం 35 జూనియర్‌ కాలేజీలున్నాయి. ఫస్టియర్‌లో 2,560 మంది పరీక్షలు రాయగా 2,374 (92.73%) మంది పాసయ్యారు. సెకెండియర్‌లో 2,413 మంది పరీక్షలు రాయగా 2,269 (94.03%) మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ఈ సొసైటీ కాలేజీలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, కేజీబీవీల్లో ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనార్హం.  

ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు ఇలా.. 
విద్యాశాఖ పరిధిలోని మోడల్‌ స్కూల్స్‌లో ఇంటర్మిడియెట్‌ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల నుంచి ఫస్టియర్‌లో 68,100 మంది పరీక్షలు రాయగా సగానికంటే తక్కువగా 28,937 (42.49%) మంది మాత్రమే పాసయ్యారు. సెకెండియర్‌లో ఉత్తీర్ణత కాస్త మెరుగ్గా ఉంది. 58,743 మందికి గాను 35,165 (59.86) మంది పాసయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల నుంచి ఫస్టియర్‌లో 3,30,811 మంది పరీక్షలకు హాజరు కాగా 2,31,535 మంది పాసై 69.99% ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్‌లో 2,97,951 మంది రాయగా.. 2,13,250 (71.57%) మంది ఉత్తీర్ణులయ్యారు.  

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు నేటి నుంచి చాన్స్‌ 
ప్రస్తుత ఫలితాలకు సంబంధించి విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కమ్‌ స్కాన్డ్‌ కాపీ ఆఫ్‌ ఆన్సర్‌ స్క్రిప్‌్ట్స కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. రీ కౌంటింగ్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ.100 చొప్పున చెల్లించాలి. స్కాన్డ్‌ కాపీ ఆఫ్‌ ఆన్సర్‌ స్క్రిప్ట్స్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

అడ్వాన్స్‌డ్‌కు సిద్ధం కండి: కేకే 
ఫలితాలు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు చింతించకుండా అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇంటర్మీడియెట్‌ అనేది భవిష్యత్‌ ప్రణాళికలకు పునాది అని అన్నారు. ఫలితాల విడుదలలో అధికారుల కృషిని అభినందించారు. కాగా ఇంటర్‌ ఫలితాలను అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టి ప్రకటించామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో మూల్యాంకనం నిర్వహించామన్నారు.  

మే 13 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు 
ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు వెల్లడించింది. మే 13వ తేదీ నుంచి వీటిని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రాక్టికల్‌ పరీక్షలను ఇదే నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షల ఫీజును ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య సంబంధిత కాలేజీలో చెల్లించాలని సూచించింది.  

గత ఏడాది గణాంకాలు పునరావృతం! 
ఇంటర్మీడియెట్‌ ఫలితాల విడుదలలో బోర్డు ఉదాసీనత వెల్లడైంది. యాజమాన్యాల (మేనేజ్‌మెంట్‌) వారీగా ఫలితాల పట్టికలో చాలావరకు గతేడాది ఇచ్చిన గణాంకాలే పునరావృతమయ్యాయి. ఇందులో ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత, పాస్‌ పర్సంటేజీ అంతా య«థాతథంగా వెల్లడించారు. తెలంగాణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ (టీఎస్‌ఆర్‌జేసీ)లు, టీజీఎస్‌ఆరీ్టసీ, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్‌ కాలేజీలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌కు సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు, పాసైన వారి సంఖ్య, ఉత్తీర్ణత శాతం గణాంకాలు ఒకే విధంగా ఉండడం గమనార్హం. 

41 కాలేజీల్లో 100% ఫలితాలు 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 41 కాలేజీల్లో సెకెండియర్‌లో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్‌లో 12 కాలేజీలు 100% ఉత్తీర్ణత సాధిస్తే..సెకెండియర్‌లో 41 కాలేజీలు 100% ఫలితాలు సాధించాయని తెలిపారు. ఫస్టియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు 468 మార్కులు ఏడుగురు విద్యార్థులు సాధించారని, అలాగే బైపీసీలో 440 మార్కులకు 438 మార్కులు ఐదుగురు విద్యార్థులు సాధించారని వెల్లడించారు. ఆర్ట్స్‌ గ్రూప్‌లో ఒక విద్యార్థి 500 మార్కులకు 494 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇక ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఇద్దరు విద్యార్థులు 995 మార్కులు సాధించగా, బైపీసీలో ఒక విద్యార్థి 994 మార్కులు సాధించారని మంత్రి పేర్కొన్నారు. ఆర్ట్స్‌ గ్రూప్‌లో ఒక విద్యార్థి 985 మార్కులు సాధించాడన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement