పన్నుల ఆదాయం 43,864 కోట్లు

Five Months Of Tax Revenue Was Rs 43, 864 Crore - Sakshi

ఐదు నెలల్లో ఖజానాకు చేరిన మొత్తం 

అప్పుల ద్వారా మరో 20వేల కోట్ల సమీకరణ 

బడ్జెట్‌లో 30 శాతానికి చేరువలో ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో 30 శాతానికి చేరువగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు నెలల కాలంలో ప్రభుత్వ ఖజానాకు వివిధ రూపాల్లో రూ.64,826 కోట్లు సమకూరినట్టు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. మొత్తం రూ.2.21 లక్షల కోట్ల బడ్జెట్‌లో 29.24 శాతంగా నమోదైంది.

గత ఏడాది ఇదే సమయానికి 31.62 శాతం రావడం గమనార్హం. ఈ ఏడాది పన్నుల ఆదాయం కింద రూ.43,864 కోట్లు రాగా, రూ.20 వేల కోట్లకు పైగా అప్పుల ద్వారా సమీకరించారు. ప్రతిపాదిత పన్నుల ఆదాయ బడ్జెట్‌ రూ.1.76 లక్షలకుగాను ఐదు నెలల్లో 25 శాతం మాత్రమే సమకూరింది. గత ఏడాది ఆగస్టు నాటికి పన్నుల ఆదాయం కింద 21.68 శాతం మాత్రమే వచ్చింది.  

అప్పులు 50 శాతం 
ఈ ఏడాది ప్రతిపాదిత అప్పుల బడ్జెట్‌లో ఐదు నెలల కాలానికే ప్రభుత్వం దాదాపు 50 శాతం మొత్తాన్ని సమకూర్చుకుంది. కాగ్‌ లెక్కల ప్రకారం ఆగస్టు నాటికి రూ.20,941.84 కోట్లు అప్పుల రూపంలో తెచ్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 వేల కోట్లు అప్పులుగా తీసుకురావాలన్నది లక్ష్యం కాగా, ఇందులో 46 శాతం ఇప్పటికే వచ్చాయి. అయితే, కరోనా కారణంగా గత ఏడాది ఇదే సమయానికి ప్రతిపాదిత బడ్జెట్‌లో 74.47 శాతం అప్పుల కింద తీసుకోవాల్సి వచ్చింది. ఇక, అప్పులకు వడ్డీల కింద ఇప్పటివరకు రూ.6,775.50 కోట్లు చెల్లించినట్టు కాగ్‌ లెక్కలు చెపుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top