హమ్మయ్య.. ఆర్‌.నాట్‌ తగ్గుముఖం!

Experts predict that the corona spread will broken down - Sakshi

ఈ నెల 12 నాటికి 1.1గా కరోనా ఆర్‌.నాట్‌ నమోదు

తాజాగా 0.98కి తగ్గినట్లు లెక్కగట్టిన శాస్త్రవేత్తలు

దేశంలో తగ్గుతున్న కొత్త కేసులు.. 83 శాతానికి పెరిగిన రికవరీలు

ఇక కరోనా వ్యాప్తికి బ్రేక్‌ పడినట్లేనని నిపుణుల అంచనా  

సాక్షి, హైదరాబాద్‌: దేశంపైకి కరోనా దండెత్తి తొమ్మిది నెలలు దాటింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇంకెంత సమయం పడుతుందోనని ప్రజలంతా ఉస్సూరుమంటున్న వేళ ఎట్టకేలకు శుభ శకునాలు కనిపిస్తున్నాయి! దేశంలో ఒకవైపు రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతుండగా కరోనాను తట్టుకొనేందుకు కొత్త ‘అస్త్రశస్త్రాలు’సమకూరుతున్నాయి! దీంతో కరోనా వ్యాప్తికి బ్రేక్‌ పడినట్లేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి .

రెండు వారాలుగా మారిన పరిస్థితి.. 
దేశంలో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 61.45 లక్షలకు చేరుకుంది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గత రెండు వారాల్లో రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 16న దేశంలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలకు చేరుకోగా.. ఆ తరువాత కూడా కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ఒక్క రోజులో నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నెల 17న అత్యధికంగా 97 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఐదు రోజులపాటు ఈ సంఖ్య తగ్గుముఖం పడుతూ 75 వేలకు చేరుకుంది. ఆ తరువాత కొంత పెరిగినప్పటికీ మంగళవారం మళ్లీ 70 వేల స్థాయికి పడిపోయింది. వ్యాధి బారినపడి కోలుకున్న వారి శాతం ఏకంగా 83 శాతానికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతోంది.

కరోనా కిల్లర్‌ విటమిన్‌ డి!
బోస్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో విటమిన్‌ డి ద్వారా కరోనా తీవ్రతను  తగ్గించవచ్చని తేలింది. శరీరంలో తగు మోతాదులో విటమిన్‌ డీ ఉంటే కరోనా కారణంగా ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవచ్చని, ముఖ్యంగా కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించే అవసరాన్ని తగ్గించవచ్చని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. విటమిన్‌ డి సమృద్ధిగా ఉండి కరోనా బారినపడ్డ వారిలో చాలా తక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని తక్కువ ఉన్న వారిలో మరణాల రేటు రెట్టింపుగా ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. విటమిన్‌–డి శరీరంలో సైటోకైన్‌ ఉప్పెన ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుండవచ్చని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్‌ ఎఫ్‌.హోలిక్‌ తెలిపారు. స్పెయిన్‌లో జరిగిన పరిశోధనలోనూ విటమిన్‌ డితో కరోనా రోగులకు మేలు జరుగుతుందని వెల్లడైంది.

యాంటీబయోటిక్‌తోనూ చికిత్స
కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌తో వచ్చే ఆరోగ్య సమస్య అయినప్పటికీ బ్యాక్టీరియాలను నిరోధించే ఓ మందుతోనూ మెరుగైన చికిత్స అందించవచ్చని ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు గుర్తించారు. టెయికోప్లానిన్‌ అని పిలిచే ఈ యాంటీబయోటిక్‌ సాధారణంగా గ్రామ్‌ పాజిటివ్‌ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కోసం ఉపయోగిస్తూంటారు. ప్రస్తుతం కరోనా కోసం ఉపయోగిస్తున్న మందుల కంటే ఈ యాంటీబయోటిక్‌ పది రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందని ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. కొంత కాలం క్రితం రోమ్‌లో ఇదే మందుపై పరిశోధనలు జరిగాయని, అయితే ఇవన్నీ పరిశోధనశాలలోనే జరిగాయి కాబట్టి మందు సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలన్నారు.

ఏమిటీ ఆర్‌.నాట్‌?
కరోనా వైరస్‌ ఒక వ్యక్తి నుంచి ఎంత మందికి వ్యాపిస్తుందో తెలియజేసే కొలమానమే ఆర్‌.నాట్‌ (ఖ0). ఇందులో ఆర్‌ అంటే రీప్రొడక్షన్‌ (పునరుత్పత్తి) కాగా, ‘0’ను ఆంగ్లంలో ‘నాట్‌’గా పిలుస్తారు. ఈ నెల 12 నాటికి దేశంలో ఆర్‌.నాట్‌ 1.1గా ఉండగా తాజాగా ఇది 0.98కి తగ్గినట్లు శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. అంటే ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాపిస్తే అది ఆర్‌. నాట్‌ 1గా లెక్క. ఒకరి నుంచి ఇద్దరికి వ్యాపిస్తే ఆర్‌.నాట్‌ రెండు అని అర్థం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల్లోనే ఈ తగ్గుదల నమోదు కావడం. ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుల్లో ఇకపై కేసుల సంఖ్య ఎలా ఉంటుందన్న అంశం ఇప్పుడు కీలకమైంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదవుతుండటం వల్ల మొత్తమ్మీద ఆర్‌.నాట్‌ తగ్గుదల తక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడటం ద్వారానే కేసుల సంఖ్య, ఆర్‌.నాట్‌ పెరగకుండా చేయొచ్చని వారు స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top