నిజామాబాద్‌అర్బన్: పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. మార్చి 2 నుంచి 31 వరకు బ్యూటీషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సు లో శిక్షణ అందించిన స్నేహ బాలికలు, యువతుల ఫొటోలు, ఫోన్ నంబర్లను సతీశ్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు.
దీంతో సతీశ్ కొంతమంది యువతులకు కాల్స్ చే యడం, వాట్సాప్ చాటింగ్ ద్వారా వేధింపులకు గురి చేశాడని వివరించారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం తమ దృష్టికి తీసుకురాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.


