హక్కుల కోసం కాక్రోచ్‌ ఉద్యమం | Cockroach movement for rights | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం కాక్రోచ్‌ ఉద్యమం

Jun 15 2026 12:54 AM | Updated on Jun 15 2026 12:55 AM

Cockroach movement for rights

ఆదివారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సామాజిక ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌

నీట్‌ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామా చేయాలి 

విద్య, పర్యావరణమేదేశ భవిష్యత్‌: సోనమ్‌ వాంగ్‌ చుక్‌ 

యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరేంటి?: ప్రొ.నాగేశ్వర్‌ 

ఇది ప్రజలఉద్యమంగా మారాలి: ఆకునూరి మురళి  

హైదరాబాద్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన గళం

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఆదివారం హక్కుల కోసం నగరంలోని ధర్నాచౌక్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీట్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌తోపాటు పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ., నీట్‌ పరీక్షల లీకేజీ వంటి ఘటనలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ... కోట్లాది యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో జవాబుదారీతనం అవసరమన్నారు. ఈ నిరసనను ఇప్పటికీ ఒక విజ్ఞప్తిగా చూస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌ యువత చూపిన శాంతియుత, శక్తివంతమైన నిరసన దేశానికి ఆదర్శమన్నారు. 

‘నేను అనేక నగరాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ హైదరాబాద్‌లో నేను చూసిన శాంతి నిరసన మరెక్కడా చూడలేదు’ అని చెప్పారు. భారత్‌ గొప్ప దేశంగా మారాలంటే విద్య, పర్యావరణ పరిరక్షణే ప్రధాన అంశాలుగా మారాలని వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. ‘విద్య ద్వారా రాబోయే తరాలకు పునాదులు వేయాలి. మీరు చెట్లను, అడవులను, నదులను రక్షిస్తున్నారు. ఇది దేశానికే గర్వకారణం’ అని అన్నారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ పిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారన్నారని, ఇలా అయితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ ఎలా సాకారమవుతుందని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలో పాల్గొంటే తమ పిల్లల స్కూల్‌ అడ్మిషన్‌కు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే పరిస్థితి దేశంలో ఉండటం సిగ్గుచేటన్నారు.

యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు: ప్రొ.నాగేశ్వర్‌ 
నీట్, సీబీఎస్‌ఈ సహా అనేక పరీక్షల్లో జరిగిన లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ప్రొ.నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ‘ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్‌ బహదూర్‌ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు వేలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా బాధ్యత తీసుకునే రాజకీయ నాయకులు కనిపించడం లేదు. ఇదే మన రాజకీయ పతనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

‘’పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు పెరిగితే బంగారం కొనొద్దంటారు. కానీ యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరు’ అన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ, ఉద్యోగాలను తొలగించడం అన్యాయమన్నారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులనే ప్రశ్నించే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సలైట్, చైనా ఏజెంట్, దేశద్రోహి అంటారు. కానీ మేము భారతమాత బిడ్డలం, భగత్‌ సింగ్‌ వారసులం’ అంటూ నినాదాలు చేశారు. 

మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇది సోషల్‌ మీడియాలో ఆగ్రహంతో ఆగిపోవద్దు, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది.? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఇలా నెలకొందని ప్రశ్నించారు. ‘యువతను కాక్రోచ్‌లుగా పేర్కొనడం సమంజసం కాదు. దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను జైలుకు పంపాలి’ అని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement