రేషన్‌ కార్డుకు రేటు!

Brokers In Circle Offices Make Special Rate For New Ration Cards - Sakshi

రూ.4 వేలు ఇస్తే చాలని బేరసారాలు

సర్కిల్‌ కార్యాలయాల్లో దళారుల తిష్ట

సంబంధిత అధికారులతో కుమ్మక్కు 

అంబర్‌పేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి నివాస్‌ రెండేళ్ల క్రితం కొత్త ఆహార భద్రత (రేషన్‌) కార్డు కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ప్రతులను పౌరసరఫరాల శాఖ సర్కిల్‌ కార్యాలయంలో సమర్పించారు. తాజాగా ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో రెండు రోజుల క్రితం ఆయన సర్కిల్‌ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీశారు.  మార్గదర్శకాలు రాలేదని సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. ఆయన వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి (దళారీ) మాట కలిపి రేషన్‌ కార్డుల పోటీ తీవ్రంగా ఉందని.. తనకు అధికారులు, సిబ్బంది తెలిసినవారేనని రూ. 4 వేలు ముట్టచెబితే మంజూరు చేయిస్తానని రేటు మాట్లాడాడు.  ముందుగా రూ.3 వేల నగదు అందజేయాలని, కార్డు మంజూరైన తర్వాత మరో వేయి ఇవ్వాలని  చెప్పాడు. అర్జీ నకలు ప్రతులను తీసుకున్నాడు. గ్రేటర్‌ పరిధిలోని సర్కిల్‌ కార్యాయాల ఆవరణల్లో మూడు రోజులుగా ఇదే తంతు జరుగుతున్నట్లు సమాచారం. 

సాక్షి, హైదరాబాద్‌: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కొత్త ఆహార భద్రత (రేషన్‌) కార్డుల దరఖాస్తుల మోక్షం లభించడంతో దళారులకు వరంగా మారింది. అధికారుల సాక్షిగా పౌరసరఫరాల శాఖ సర్కిల్‌ ఆఫీసు ఎదుట తిష్టవేశారు. నయా కార్డుల దందాకు తెరలేపారు. పెండింగ్‌  దరఖాస్తులపై ఆరా తీసేందుకు సర్కిల్‌ ఆఫీసులకు వస్తున్న వారికి గాలం వేస్తున్నారు. కార్యాలయ సిబ్బంది కూడా దరఖాస్తుదారులకు సరైన సమాధానం ఇవ్వకపోవడం దళారుల దందాకు మరింత కలిసి వస్తోంది. మరోవైపు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్థితిగతుల్ని  తెలుసుకునేందుకు వచ్చే వారికి సైతం బ్రోకర్లు ముగ్గులోకి దించుతున్నారు. కొత్తకార్డులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే దళారుల దందా జోరందుకుంది. అదికారుల అండదండలతో పేదల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. 

ఫలించిన ఎదురుచూపులు.. 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం తెల్లరేషన్‌ కార్డులను రద్దు చేసి వీటి స్థానంలో ఆహార భద్రత కార్డులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చింది. కొత్త కార్డుల దరఖాస్తు, మంజూరు కోసం ఎలాంటి గడువు విధించకుండా నిరంతర ప్రక్రియగా ప్రకటించింది. ఆదిలో కొంత కాలం కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగినా.. ఆ తర్వాత  ఆచరణ అమల్లో ముందుకు సాగక  అది కాస్తా దీర్ఘకాలిక పెండింగ్‌గా మారిపోయింది. రెండేళ్ల క్రితం పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌ కోసం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ ఆచరణలో సాధ్యపడలేదు. కొత్త కార్డుల జారీ, కార్డుల్లో మార్పులు, చేర్పులు సైతం పెండింగ్‌లో పడిపోయాయి 

కొత్త రేషన్‌ కార్డుల పెండింగ్‌ ఇలా.. 
అర్బన్‌ సర్కిల్‌    దరఖాస్తులు 

మలక్‌పేట    5,904      
యాకుత్‌పురా    16,612
చారి్మనార్‌    19,386 
నాంపల్లి    2,863 
మెహిదీపట్నం    19,168 
అంబర్‌పేట    5,386
ఖైరతాబాద్‌     12,106 
బేగంపేట్‌    5,267
సికింద్రాబాద్‌    5,542  
బాలానగర్‌    36,894 
ఉప్పల్‌    36,423
సరూర్‌నగర్‌     22,995 

వెబ్‌సైట్‌ నిలిపివేత
కొత్త కార్డుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను మాత్రం నిలిపివేసింది. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) వెబ్‌సైట్‌ నాలుగు రోజులుగా ఆగిపోయింది. మూ డేళ్ల క్రితం ఏకంగా తొమ్మిది నెలలపాటు వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన పౌరసరఫరాల శాఖ ఆ తర్వాత పునరుద్ధరించి కేవలం దరఖాస్తు ల స్వీకరణకు మాత్రమే అనుమతించింది. ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే కొత్త కార్డుల మంజూరు, కార్డుల్లో మార్పులు, చేర్పులు ప్రక్రి య పునఃప్రారంభమవుతుందన్న ప్రచారం జరగడంతో మీ సేవ కేంద్రాలతో పాటు సివిల్‌ సప్లయీస్‌ సర్కిల్‌ ఆఫీసులకు దరఖాస్తుల తాకిడి పెరిగింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రతులు సర్కిల్‌ ఆఫీసుల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నా యి. తాజాగా పెండింగ్‌ దరఖాస్తుల్లో కదలికలు వచ్చినా.. తాజాగా మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త అర్జీల స్వీకరణ మాత్రం ఆగిపోయింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top