హిట్ కాంబో రిపీట్
తమిళసినిమా: సక్సెస్‌పుల్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ చిత్రంపై ఏర్పడే అంచనాలే వేరే. కాగా అలాంటి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. నటుడు అజిత్‌కు సెంటిమెంట్ అంటారో,లేకు ఫాలసీ అంటారో అలాంటిదేదో ఉందని మాత్రం చెప్పవచ్చు. ఈయన ఒక దర్శకుడితో గానీ, ఒక చిత్ర నిర్మాణ సంస్థలో గానీ పని చేస్తే, వారితో మళ్లీ మళ్లీ చిత్రాలు చేస్తుంటారు. అలా విష్ణువర్ధన్ దర్శకత్వంలో బిల్లా, ఆరంభం చిత్రాలను చేశారు. అదేవిధంగా ఏఎం.రత్నం సంస్థలో వరుసగా ఆరంభం, ఎన్నై అరిందాల్ చిత్రాలను చేశారు. ఇకపోతే దర్శకుడు శివ దర్శకత్వంలో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం మొదలగు నాలుగు చిత్రాల్లో నటించారు. పైన చెప్పిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ కావడం గమనార్హం. కాగా ఆ తరువాత దర్శకుడు శివ నటుడు రజనీకాంత్ హీరోగా అన్నాత్తే చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత సూర్య కథానాయకుడిగా కంగువా చిత్రాన్ని చేశారు. భారీ బడ్జెట్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరచింది. దీంతో దర్శకుడు శివ కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ మెగాఫోన్ పట్టుడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు నాలుగు హిట్ చిత్రాలను ఇచ్చిన నటుడు అజిత్ హీరోగా మరో భారీ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శివనే ఇటీవల స్వయంగా ఓ భేటీలో పేర్కొన్నారు.ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు అన్నీ సక్రమంగా అమరినప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని బదులిచ్చారు. అదేవిధంగా ఆ చిత్రం ఎలాంటి నేపథ్యంలో ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు. మొత్తం మీద అజిత్, దర్శకుడు శివ కాంబోలో 5వ చిత్రం ఖరారు అయ్యిందన్నమాట. కాగా ప్రస్తుతం కార్ రేస్ పోటీల్లో బిజీగా ఉన్న అజిత్ తదుపరి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవతున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి కమర్శియల్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. తాజా చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


