ఘనంగా ఉట్ల పరుష
చిలమత్తూరు: తిమ్మారెడ్డిపల్లిలోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం ఉట్లపరుష ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కుమారస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్లమాను ఎక్కేందుకు పోటీపడ్డారు. అనంతరం విజేతకు బహుమతులు అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒడిశా వాసి మృతి
బత్తలపల్లి: బతుకు తెరువు నిమిత్తం వచ్చి... రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒడిశా రాష్ట్ర వాసి మృతి చెందిన సంఘటన బత్తలపల్లి మండలం వేల్పుమడుగు బస్‌స్టాప్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాలోని శిబతల గ్రామానికి చెందిన పరమేశ్ సాహు(57)ను వేల్పుమడుగు బస్‌స్టేజ్ సమీపంలోని సిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడు. మృతుడు బతుకు తెరువు నిమిత్తం వేల్పుమడుగులోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. రోజూ భోజనం చేసేందుకు సిల్క్ ఫ్యాక్టరీ పక్కనున్న హోటల్‌కు వెళ్లేవాడని, అందులో భాగంగా శనివారం రాత్రి భోజనానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఇటుకల బట్టి యజమాని దూదేకుల పీరా సాహెబ్ మృతుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బు వ్యవహారంలో దాడి
గుత్తి: మున్సిపాలిటీ పరిధిలోని గుంతకల్లు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీలో డబ్బు వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే వర్గానికి చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, బాలరంగారెడ్డి గాయపడ్డారు. తమపై మధు, నవీన్, జనార్ధన్‌తో పాటు మరో ఇద్దరు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


