టీడీపీ నాయకుడి కబ్జా పర్వం
హిందూపురం టౌన్: అక్రమాలకు, కబ్జాలకు పాల్పడినా పార్టీ తనకు అండగా ఉంటుందనే ధీమాతో ఓ టీడీపీ నాయకుడు ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తుండటంతో పాటు తన ఇంటికి దారి లేకుండా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దీనిపై స్పందించి న్యాయం చేయాలి ’ అని పట్టణంలోని మోతుకుపల్లికి చెందిన రామాంజినేయులు, భరత్ కుమార్ వేడుకున్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం పక్కా గృహం మంజూరు చేసిందని, ఆ ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే మోతుకుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు చంద్రమోహన్‌యాదవ్ తన ఇంటి దారిని కబ్జా చేయడానికి పూనుకున్నాడన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ తన ఇంటికి దారి లేకుండా చేశాడన్నారు. అలాగే ప్రభుత్వ స్థలం కబ్జా చేయడానికి పూనుకున్నాడని, దీనిపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆ స్థలం విషయంలో కోర్టుకు కూడా వెళ్లామన్నారు. గ్రామంలో ప్రభుత్వ స్థలం ఖాళీ ఉన్నప్పటికీ తన ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరించి, తన ఇంటి దారికి నష్టం కలిగే విధంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడన్నారు. ప్రస్తుతం తన ఇంటి లోపలికి వెళ్లడానికి దారి కూడా లేదని వాపోయారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు


