Wimbledon 2021: సూపర్‌ సబలెంకా 

Wimbledon: Sabalenka Stops Ons, Medvedev Stumbles - Sakshi

కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీస్‌లోకి

వింబుల్డన్‌లో మొదటిసారి సెమీస్‌ చేరిన యాష్లే బార్టీ, ప్లిస్కోవా

లండన్‌: కెరీర్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడినా... ఒక్కసారీ నాలుగో రౌండ్‌ దాటలేకపోయిన బెలారస్‌ భామ అరీనా సబలెంకా 15వ ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సబలెంకా క్వార్టర్‌ ఫైనల్లో 6–4, 6–3తో 21వ సీడ్‌ ఆన్స్‌ జెబర్‌ (ట్యూనిషియా)పై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 27 విన్నర్స్‌ కొట్టిన ఆమె నెట్‌ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 11సార్లు పాయింట్లు సాధించింది. తొలి సెట్‌లో 5–4తో ఆధిక్యంలో ఉన్నదశలో దాదాపు పది నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో జెబర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సబలెంకా తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో సబలెంకా రెండో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో జెబర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. తాజా విజయంతో నటాషా జ్వెరెవా (1998), అజరెంకా (2011, 20112) తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన మూడో బెలారస్‌ క్రీడాకారిణిగా సబలెంకా గుర్తింపు పొందింది.

ప్లిస్కోవా జోరు... 
ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, మాజీ నంబర్‌వన్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–2తో గోలూబిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై... టాప్‌ సీడ్, వరల్డ్‌ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–3తో తొమ్‌యానోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. మరో క్వార్టర్‌ ఫైనల్లో 2018 చాంపియన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) 6–2, 6–3తో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించి నాలుగోసారి సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. 2012లో సెమీస్‌ చేరిన కెర్బర్‌ 2016లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో బార్టీతో కెర్బర్‌; ప్లిస్కోవాతో సబలెంకా తలపడతారు. 

రెండో సీడ్‌ మెద్వెదేవ్‌కు షాక్‌ 
పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 6–2, 6–7 (2/7), 6–3, 3–6, 3–6తో 14వ సీడ్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌) చేతిలో ఓడిపోయాడు. ఈ గెలుపుతో హుబర్ట్‌ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫుచోవిచ్‌ (హంగేరి)తో జొకోవిచ్‌ (సెర్బియా); హుబర్ట్‌తో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌); షపోవలోవ్‌ (కెనడా)తో ఖచనోవ్‌ (రష్యా); ఫీలిక్స్‌  (కెనడా)తో బెరెటిని (ఇటలీ) తలపడతారు. రోహన్‌ బోపన్న–సానియా మీర్జా (భారత్‌) మిక్స్‌డ్‌ డబుల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)–ఆండ్రియా క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీతో మ్యాచ్‌లో బోపన్న–సానియా జంట తొలి సెట్‌ను 3–6తో కోల్పోయింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top