Ind Vs Nz Test Series:‘చాంపియన్‌’తో సమరానికి సై

Team India gears up ahead of first Test Match with New Zealand - Sakshi

నేటినుంచి న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి టెస్టు

ముగ్గురు స్పిన్నర్లతో రహానే బృందం

విజయంపై విలియమ్సన్‌ సేన ఆశలు

ఉ.గం. 9.30నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ప్రపంచ టెస్టు చాంపియన్‌ న్యూజిలాండ్‌పై తమ సొంతగడ్డలో బదులు తీర్చుకునేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌లో తమకు టైటిల్‌ అందకుండా చేసిన జట్టును కసితీరా ఓడించేందుకు టీమిండియా ఎప్పటిలాగే స్పిన్‌ అస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు కివీస్‌ కూడా టి20లో ఎదురైన క్లీన్‌స్వీప్‌ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

కాన్పూర్‌: భారత్‌తో జరిగిన గత మూడు టెస్టుల్లో న్యూజిలాండ్‌దే విజయం. ఇందులో రెండు మ్యాచ్‌లో కివీస్‌ సొంతగడ్డపై ఆడగా...మరో మ్యాచ్‌ తటస్థ వేదికపై (డబ్ల్యూటీసీ ఫైనల్‌) జరిగింది. అయితే భారత్‌లో భారత్‌ను టెస్టుల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం కివీస్‌కు బాగా తెలుసు. 2016 సిరీస్‌లో ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది.

ఈ నేపథ్యంలో గత మూడు పరాజయాలకు బదులు తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత్‌ ఉంది. పైగా సొంతగడ్డపై ఆడే అనుకూలత కూడా టీమిండియాకు కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరుజట్ల మధ్య మొదలయ్యే తొలి టెస్టు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగే అవకాశముంది. భారత జట్టులో రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి  గైర్హాజరు కాగా... టి20ల నుంచి విశ్రాంతి తీసుకున్న కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ టెస్టు పరీక్షకు అందుబాటులో ఉండటం ప్రత్యర్థి జట్టుకు బలం.

ఆత్మవిశ్వాసంతో టీమిండియా
పొట్టి మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ టెస్టు సిరీస్‌నూ విజయవంతంగా ముగించాలనే లక్ష్యంతో ఉంది. మయాంక్‌తో కలిసి శుబ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. టెస్టుల్లో స్పెషలిస్ట్‌ ఓపెనర్లయిన వీరిద్దరు శుభారంభం అందించగలరు కాబట్టి లోకేశ్‌ రాహుల్‌ లేని లోటైతే కనిపించదు. కోహ్లి విశ్రాంతి జట్టుకు ఇబ్బందికరమైనప్పటికీ నాలుగో స్థానంలో తాత్కాలిక సారథి రహానే ఫామ్‌లోకి వస్తే అంతా సర్దుకుంటుంది.

వన్‌డౌన్‌లో చతేశ్వర్‌ పుజారా నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు నీరసించక తప్పదు. శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు అరంగేట్రం చేస్తాడని ఒక రోజు ముందుగానే రహానే ప్రకటించాడు. కాబట్టి సూర్యకుమార్‌ యాదవ్‌ బెంచ్‌కే పరిమితం! భారత్‌లో స్పిన్నే ప్రధాన ఆయుధం... ఈ నేపథ్యంలో వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌తో పాటు జడేజా, అక్షర్‌ పటేల్‌ తుది జట్టులో ఖాయంగా ఆడతారు. పేసర్లలో ఇషాంత్‌ శర్మతో హైదరాబాదీ సీమర్‌ సిరాజ్‌ లేదంటే ఉమేశ్‌ యాదవ్‌ బరిలోకి దిగే అవకాశముంది. కోహ్లి, రోహిత్, బుమ్రా, షమీ, పంత్‌లాంటి ప్లేయర్లు లేకపోయినా స్వదేశంలో తిరుగు లేని జట్టయిన భారత్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే టెస్టు విజయం కష్టం కాబోదు.  

విలియమ్సన్‌ అండతో...
రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ లేని జట్టు మూడు టి20ల్లోనూ చిత్తుగా ఓడింది. కానీ టెస్టులకు కొండంత అండ కేన్‌ హాజరుతో లభించింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ కూడా అందుబాటులోకి రావడం జట్టును పటిష్టంగా మార్చింది. అయితే భారత్‌లో న్యూజిలాండ్‌ రికార్డే అత్యంత పేలవంగా ఉంది. ఇప్పటివరకు 34 టెస్టులు ఆడితే కేవలం 2 టెస్టులే గెలవగలిగింది. అప్పుడెప్పుడో 1988లో చివరిసారిగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ విజయానికి చేరువగా రాలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌ హోదాతో భారత్‌కు వచ్చింది. ప్రధాన బౌలర్లలో ఒకడైన ట్రెంట్‌ బౌల్ట్‌ విశ్రాంతితో స్వదేశం చేరాడు. ఈ నేపథ్యంలో పేస్‌ భారమంతా సీనియర్‌ సీమర్‌ సౌతీపైనే ఉంది. భారత్‌లోని స్పిన్‌ పిచ్‌ల దృష్ట్యా ఎజాజ్‌ పటేల్, సొమర్‌విల్లేలను తీసుకొచ్చినా... వీళ్లు ఏమాత్రం ప్రభావం చూపుతారో మైదానంలోనే చూడాలి.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top