IND Vs PAK: 'భారత్‌ బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్‌ లేకుండానే ఆడేవారు'

T20 WC: Salman Butt Says How India Earlier Pace Attack Not Intimidating - Sakshi

టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మరో రెండు వారాల సమయం ఉంది. కాస్త సమయం ఉన్నప్పటికి ఇప్పటినుంచే అభిమానులు పదునైన మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ అంటే ఎంత హైవోల్టేజ్‌ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

తాజాగా భారత్‌, పాక్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు సల్మాన్‌ భట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత్‌ పేస్‌ బౌలింగ్‌ వీక్‌గా ఉండడంతో పాక్‌ ఓపెనర్లు హెల్మెట్లు లేకుండానే బరిలోకి దిగేవారంటూ పేర్కొన్నాడు. సల్మాన్‌ భట్‌ మాట్లాడుతూ.. 'సయీద్‌ అన్వర్‌, అమీర్‌ సోహైల్‌లు ఆడుతున్న సమయంలో టీమిండియా పేస్‌ బౌలింగ్‌ వీక్‌గా ఉండేది. అందుకే వాళ్లు హెల్మెట్లు లేకుండానే బరిలోకి దిగేవారు. తలకు క్యాప్‌ను పెట్టుకుని టీమిండియా బౌలర్లను ఉతికారేసేవారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

2013లో భారత్‌, పాక్‌ల మధ్య చివరిసారి ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో మ్యాచ్‌లకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటినుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతూ వస్తున్నాయి. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ భారత్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఆసియాకప్‌లో తలపడగా.. టీమిండియా పాక్‌పై బదులు తీర్చుకుంది. మళ్లీ నెల వ్యవధిలోనే ఇరుజట్లు పొట్టి ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. మరి ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. 

ఇక సల్మాన్‌ భట్‌ పాకిస్తాన్‌ తరపున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20లు ఆడాడు. 2010లో తోటి క్రికెటర్లు మహ్మద్‌ ఆమిర్‌, మహ్మద్‌ ఆసిఫ్‌లతో కలిసి సల్మాన్‌ భట్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడం అతని కెరీర్‌ను అంధకారంలో పడేసింది.ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజమని తేలడంతో సల్మాన్‌ భట్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. 2015లో నిషేధం నుంచి బయటపడ్డ సల్మాన్‌ భట్‌ అప్పటినుంచి దేశవాలీ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత మే 2022లో సింగపూర్‌ క్రికెట్‌ టీమ్‌కు కన్సల్టెంట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

చదవండి: ఉమ్రాన్‌ మాలిక్‌కు వీసా కష్టాలు..ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇబ్బందులు

క్రికెట్‌లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top