ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతున్న పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ ఓటమి రుచి చూపించింది. సొంతగడ్డ ముల్లాన్‌పూర్ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు.
అంతకుముందు ప్రభ్‌సిమ్రన్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు.
అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్ ఫెరియెరా (52 నాటౌట్), షుభమ్ దూబే (31 నాటౌట్) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) తమ సహజశైలిలో రెచ్చిపోయి రాయల్స్ గెలుపుకు గట్టి పునాది వేశారు.
ఆతర్వాత వచ్చిన ధృవ్ జురెల్ (16) కాస్త తడబడినప్పటికీ.. అతని తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (29) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతని తర్వాత క్రీజ్‌లో కుదురుకున్న ఫెరియెరా, షుభమ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో చహల్ 3, అర్షదీప్ ఓ వికెట్ తీశారు.


