టీమిండియాకు సెలక్ట్‌ చేయమని అడగట్లేదు.. కానీ | Forget about selection Not even part of conversation: Aakash Chopra | Sakshi
Sakshi News home page

సెలక్షన్‌ పక్కనపెట్టండి.. చర్చల్లో కూడా ఆ పేరు లేదు!

Apr 29 2026 12:46 PM | Updated on Apr 29 2026 12:54 PM

Forget about selection Not even part of conversation: Aakash Chopra

భారత టీ20 జట్టులో స్థానం కోసం పోటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఈ రేసులో ముందు వరుసలో ఉండగా.. దేవదత్‌ పడిక్కల్‌, ఆకిబ్‌ నబీ, ప్రియాన్ష్‌ ఆర్య, చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి.

చివరగా అపుడే
అయితే, వీరందరి కంటే అర్హుడైన ఆటగాడు మరొకడు ఉన్నాడని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. గత మూడేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నా అతడిని సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే.. యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal).

టీ20 ప్రపంచకప్‌-2024లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుతో ప్రయాణించాడు జైసూ. ఆ తర్వాత శ్రీలంకతో జూలైలో జరిగిన సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున చివరి టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్‌లో మాత్రం రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా జైస్వాల్‌ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.

తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో.. 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్‌. పంజాబ్‌పై రాజస్తాన్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియాకు సెలక్ట్‌ చేయమని అడగట్లేదు.. కానీ
‘‘గత మూడేళ్లుగా అతడి గణాంకాలు పరిశీలించండి. 2024లో వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించేశారు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఇలాంటివి సహజమే.

అయితే, యశస్వి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. అతడిని కచ్చితంగా భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని నేను అనడం లేదు. జట్టులో ఇప్పుడు చోటు ఖాళీగా లేదని నాకు కూడా తెలుసు.

సెలక్షన్‌ సంగతి పక్కనపెడితే..
కానీ ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. గత మూడేళ్లుగా అతడు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. సగటు, స్ట్రైక్‌రేటు కూడా బాగుంది. తన పనిని తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అయినా సరే సెలక్షన్‌ సంగతి పక్కనపెడితే.. కనీసం చర్చల్లో కూడా ఎవరూ అతడి పేరు తీసుకురావడం లేదు.

గంజిలో ఈగ లాగా తీసిపారేశారు. అతడు చేసిన తప్పేంటి?’’ అని ఆకాశ్‌ చోప్రా టీమిండియా సెలక్షన్‌ కమిటీ తీరును విమర్శించాడు. కాగా ఐపీఎల్‌-2026లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్‌ 306 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతేడాది 14 మ్యాచ్‌లలో కలిపి 559.. అదే విధంగా 2024లో 16 మ్యాచ్‌లలో కలిపి 435 పరుగులు సాధించాడు యశస్వి జైస్వాల్‌. 

చదవండి: బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Advertisement
 
Advertisement
Advertisement