Team India: ఐపీఎల్‌ బ్యాన్‌ చేస్తేనే దారిలోకి వస్తారా!

Fans Demand Ban IPL To Get Team India Track For Winning World Cups - Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం సెమీస్‌తోనే ముగిసింది.  కచ్చితంగా ఫైనల్‌ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. బౌలర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఒక్క బౌలర్‌ కూడా ప్రభావం చూపలేకపోయాడు. కనీసం ఒక్క గుడ్‌లెంగ్త్‌ బంతి పడితే ఒట్టు.. ఏ బౌలర్‌ అయినా యార్కర్‌ వేయాలని చూస్తారు. కానీ అదేంటో టీమిండియా బౌలర్లంతా ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వేస్తూ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల చేత పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీమిండియాకు రాను రాను బౌలర్లు కరువయ్యే ప్రమాదం పొంచి ఉంది.

అయితే టీమిండియా ఓటమి వెనుక ప్రధాన కారణం మాత్రం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) అని అభిమానులు కుండబద్దలు కొట్టారు. ఐపీఎల్‌ను బ్యాన్‌ చేస్తేనే టీమిండియా జట్టు దారిలోకి వస్తుందంటున్నారు. ఐపీఎల్‌ మోజులో పడి టీమిండియా ఆటగాళ్లలో కొందరు రాణించలేకపోతున్నారన్నారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే మెరుస్తారు తప్ప ఐసీసీ లాంటి మేజర్‌ టోర్నీలకు పనికిరారని ఎండగట్టారు. ఏదో రెండు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీలు చేసినంత మాత్రానా ఫామ్‌లోకి వచ్చినట్లు కాదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ నిర్లక్ష్యపు షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకోవడం కనిపించింది.

ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిల్‌లు సాధించిన రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్‌గానే పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్‌ లాంటి ప్రైవేటు లీగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను పోల్చకూడదని రోహిత్‌కు ఈ పాటికే అర్థమయి ఉండాలన్నారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడాలంటే అది కోహ్లి, సూర్యకుమార్‌లు మాత్రమే. కోహ్లి, సూర్యలు తప్పిస్తే టీమిండియాలో ఏ ఆటగాడు పెద్దగా ప్రభావం చూపలేదు. కోహ్లి, సూర్యలు మరికొంతకాలం టీమిండియా బ్యాటింగ్‌లో వెన్నుముక పాత్ర పోషించడం మాత్రం ఖాయమని అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: కోహ్లి, రోహిత్‌ రిటైరవుతారా?.. ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top