స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఇవాళ (ఏప్రిల్ 27) ప్రారంభమైన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్రత్యర్దిని 182 పరుగులకు (6 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కేటీన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్ క్లార్క్‌సన్ (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకీబ్, మెహిది హసన్ తలో వికెట్ తీశారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తౌహద్ హృదోయ్ (51 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్‌కు పర్వేజ్ హొసేన్ (28), షమీమ్ హొసేన్ (31 నాటౌట్) సహకరించారు.
మిగతా ఆటగాళ్లలో సైఫ్ హసన్ 17, తంజిద్ హసన్ 20, కెప్టెన్ లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఐష్ సోధి 2, జోష్ క్లార్క్‌సన్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 29న జరుగనుంది.


