‘కనీసం ఒక్క బ్యాటర్‌ ఆడినా కథ వేరుగా ఉండేది’ | Axar Patel Shell Shocked Statement As DC Get Bowled Out For 75 vs RCB In IPL 2026, Credits Opponents Bowling | Sakshi
Sakshi News home page

‘కనీసం ఒక్క బ్యాటర్‌ ఆడినా కథ వేరుగా ఉండేది’

Apr 28 2026 9:11 AM | Updated on Apr 28 2026 10:48 AM

Axar Patel Shell Shocked Statement As DC Get Bowled Out For 75 vs RCB

ఢిల్లీ సారథి అక్షర్‌ పటేల్‌ (PC: BCCI)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్‌లో ఘోర పరాభవంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ స్పందించాడు. అసలేం జరిగిందో తనకు ఇంకా అర్థం కావడం లేదని.. ఇంకా షాక్‌ నుంచి కోలుకోలేదని తెలిపాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా సొంతమైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ సోమవారం ఆర్సీబీతో తలపడింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అక్షర్‌ సేన.. 75 పరుగులకే కుప్పకూలింది. 1/0, 2/2, 3/2, 4/7, 5/7, 6/8... ఒక్కో వికెట్‌ పడుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్లు ఇవి. టాప్‌–6 బ్యాటర్లంతా వరుసగా 0, 1, 1, 0, 5, 0 పరుగులతో చేతులెత్తేశారు... భువనేశ్వర్, హాజల్‌వుడ్‌ నిప్పులు చిమ్ముతుండగా సొంతగడ్డపై ఢిల్లీ విలవిల్లాడింది. 

టెస్టు మ్యాచ్‌ను తలపించేలా
టెస్టు మ్యాచ్‌ను తలపించేలా బంతి అద్భుతంగా స్వింగ్‌ అవుతుండగా ఇద్దరు పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఆడుకున్నాడు. తొలి 23 బంతుల్లో ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, ఐపీఎల్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) నమోదు కావడం ఖాయమనిపించింది. 

అయితే, అభిషేక్‌ పొరేల్‌ పట్టుదలతో ఎలాగోలా ఆ మార్క్‌ను అధిగమించినా ఢిల్లీ చివరకు 75 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీకి కేవలం 39 బంతులు సరిపోయాయి. ఒక వికెట్‌ కోల్పోయి పని పూర్తి చేసిన ఆర్సీబీ ఢిల్లీపై తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ఇప్పటికీ అర్థం కావడం లేదు
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్‌ పటేల్‌ స్పందిస్తూ.. ‘‘అసలేం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము అంటారు. ఏదేమైనా మేమే ఈ పరాభవం నుంచి కోలుకుని ముందుకు సాగాల్సి ఉంది.

ఐపీఎల్‌ చాలా కఠినమైన టోర్నమెంట్‌. ఒక్కరోజులోనే అంతా తారుమారై పోవచ్చు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా రాణిస్తేనే రేసులో ఉంటాము. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేము. ప్రతికూల ఆలోచనలతో ఉంటే తదుపరి మ్యాచ్‌పై కూడా ఆ ప్రభావం పడుతుంది.

మా బ్యాటర్లను తప్పు పట్టాల్సిన పనిలేదు
ఈరోజు మాది కాదు. మా జట్టుతో కూడా ఇదే మాట చెబుతాను. ఈరోజు మా బ్యాటర్ల వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి జట్టులో వరల్డ్‌క్లాస్‌ బౌలర్లు ఉన్నారు. వాళ్లు ఎక్కడైనా బంతిని స్వింగ్‌ చేయగలరు. కాబట్టి మా పవర్‌ప్లేలో వాళ్లు వికెట్లు తీసిన తీరు నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు.

 

ఏదేమైనా మా ఓపెనర్లు, లేదంటే టాపార్డర్‌లో కనీసం ఒక్క బ్యాటర్‌ అయినా క్రీజులో కుదురుకుని ఉంటే కథ కాస్త వేరుగా ఉండేది. ఏదేమైనా క్రెడిట్‌ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఈ అవమానకర ఓటమి నుంచి కోలుకుని తాము ముందుకు సాగుతామని అక్షర్‌ పటేల్‌ ఈ సందర్భంగా తెలిపాడు.

చదవండి: అటు కోహ్లి... ఇటు అజితేశ్‌... ప్లేయర్, అంపైర్‌గా నాటి సహచరులు

Advertisement
 
Advertisement
Advertisement