ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.
ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్‌ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్ నాయర్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.
అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కుల్దీప్ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్, ముకేశ్ కుమార్, ఆకిబ్ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్‌పై 264 పరుగుల స్కోర్ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు.
లక్ మా పక్షాన ఉండి, క్యాచ్‌లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్‌లో మేం ఓడిన మ్యాచ్‌లు చూస్తే చాలా వరకు క్లోజ్ మ్యాచ్‌లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది.
ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్‌సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది.


