హాల్‌ ఆఫ్‌ 'షేమ్‌'లో రహానే | Ajinkya Rahane Tops Worst Ever IPL Captains' List Amid KKR Slump | Sakshi
Sakshi News home page

హాల్‌ ఆఫ్‌ 'షేమ్‌'లో రహానే

Apr 18 2026 1:23 PM | Updated on Apr 18 2026 1:39 PM

Ajinkya Rahane Tops Worst Ever IPL Captains' List Amid KKR Slump

ఐపీఎల్‌ 2026లో వరుస పరాజయాల కారణంగా ముప్పేటదాడిని ఎదుర్కొంటున్న కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మరో ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త కెప్టెన్‌గా అపవాదును సొంతం చేసుకున్నాడు. కనీసం 25 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటే, అత్యధిక పరాజయాల శాతం కలిగిన కెప్టెన్‌గా రహానే అందరికంటే ముందున్నాడు.

రహానే తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో 44 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 14 మ్యాచ్‌ల్లోనే (28 పరాజయాలు, 2 ఫలితం రాలేదు) తన జట్టును గెలిపించాడు. ఈ లెక్కన అతని విజయాల శాతం కేవలం 31.83 మాత్రమే. ఐపీఎల్‌లో కనీసం 25 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లలో ఇంత తక్కువ విన్నింగ్‌ పర్సంటేజ్‌ ఎవరికీ లేదు. రహానే తర్వాతి స్థానాల్లో.. 

మహేళ జయవర్దనే (30 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 33.33 విన్నింగ్‌ పర్సంటేజ్‌),
కుమార సంగక్కర (47 మ్యాచ్‌ల్లో 17 విజయాలు, 36.2),
శిఖర్‌ ధవన్‌ (27 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 37),
సౌరవ్‌ గంగూలీ (42 మ్యాచ్‌ల్లో 17 విజయాలు, 40.5) ఉన్నారు.

మొత్తం కెప్టెన్సీ కెరీర్‌లోనే ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన రహానే, కేకేఆర్‌ కెప్టెన్‌గా మరింత దారుణమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2025 ఎడిషన్‌లో కేకేఆర్‌ సారధిగా (14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) బాధ్యతలు చేపట్టిన రహానే, ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ తరఫున 19 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించి ఏకంగా 12 మ్యాచ్‌ల్లో తన జట్టును పరాజయం బాట పట్టించాడు. 

కేకేఆర్‌ తరఫున అతని విజయాల శాతం కేవలం 26.31 మాత్రమే. కేకేఆర్‌కు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే, ఆ ఫ్రాంచైజీ తరఫున కూడా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. రాయల్స్‌ కెప్టెన్‌గా 24 మ్యాచ్‌ల్లో కేవలం తొమ్మిదే విజయాలు సాధించాడు.

కాగా, రహానే సారథ్యంలో కేకేఆర్‌ తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడింది. ఈ ఓటమి ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఐదవది (6 మ్యాచ్‌ల్లో). పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం​ కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్‌ ఉంది. ఏప్రిల్‌ 19న జరిగే తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌ పటిష్టమైన రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement