చెల్లి పెళ్లికి భూమి అమ్మడం లేదని..
కన్న తండ్రినే కడతేర్చిన తనయుడు
షాద్‌నగర్‌రూరల్: చెల్లి పెళ్లికి డబ్బుల కోసం భూమి అమ్మడం లేదని కన్న తండ్రిని కొడుకు హతమార్చాడు. మండల పరిధిలో జరిగి ఈ దారుణ ఘటన వివరాలను సీఐ విజయ్‌కుమార్ వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దేవునిబండతండాకు చెందిన పాత్లావత్ బాలు(43) కుమారుడు పాత్లావత్ మోహన్ అలియాస్ గుండు తన చెల్లికి పెళ్లి చేయాలనుకున్నాడు. చెల్లి పెళ్లికి డబ్బుల కోసం తన తండ్రి బాలు పేరుపై ఉన్న 5గుంటల భూమిని అమ్ముదామనగా తండ్రి ఒప్పుకోలేదు. భూమి విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగేవి. ఎలాగైనా తండ్రిని చంపి భూమిని అమ్మి సోదరి పెళ్లి చేయాలని అనుకున్నాడు. దీంతో ఈ నెల 8న మద్యం తాగుదామని తండ్రిని కొడుకు తన ఆటోలో ఎక్కించుకొని షాద్‌నగర్‌కు వచ్చాడు. మధ్యరాత్రి వరకు మద్యం తాగి అదే ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మండల పరిధిలోని నేరెళ్లచెరువు గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని చెరువు గుంతలో పడేసి చనిపోయాడని నిర్ధారించుకొని వెళ్లిపోయాడు. బాలు కనిపించడంలేదని అతని సోదరి మెగావత్ సోనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని కేశంపేట బైపాస్ సమీపంలో నిందితుడు ఆటోలో పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి ఆటో, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.


