ఉరుకులు.. పరుగులు
● గాజులరామారంలో 3 సెకన్లు కంపించిన భూమి
● ఎలాంటి ప్రకంపనలు నమోదు కాలేదు: ఇన్‌కాయిస్ అధికారులు
సుభాష్‌నగర్: గాజులరామారంలోని మెట్‌కానిగూడ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 10. 20 గంటల సమయంలో మెట్‌కానిగూడ, హెచ్‌ఏఎల్, ఓక్షిత్ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్ కాలనీల్లో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించడంతో అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. గేటెడ్ అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుంపులుగా చేరారు. భూమి కంపించడంతో స్థానిక పాఠ శాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. కొద్దిసేపటి దాకా ఇళ్లలోకి పోయేందుకు స్థానికులు భయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు భూకంపమా..? లేక ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి ఏ విష యమూ అంతు చిక్కలేదని సూరారం సీఐ సుధీర్ కృష్ణ తెలిపారు. ప్రగతి నగర్‌లోని ఇన్‌కాయిస్ అధికారులకు సంప్రదించగా.. ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు.


