పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
అడిషనల్ డీసీపీ సత్యనారాయణ
ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మహేశ్వరం జోన్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ బి.వి.సత్యనారాయణ చెప్పారు. ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో మంగళవారం మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తు విధులపై సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. విధుల్లో సిబ్బంది ఎక్కడా అలసత్వానికి తావు ఇవ్వరాదని సూచించారు. సమావేశంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


