ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
షాద్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ శిరీష తెలిపారు. పట్టణంలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్‌రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బృందాలతో భద్రత నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ ముగిసిన వెంటనే అత్యంత భద్రత నడుమ బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూంకు తరలించనున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూం వద్ద నిరంతరం మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు రోజు అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
రేడియల్ రోడ్డు సర్వేను
అడ్డుకున్న రైతులు
కొందుర్గు: కొత్వాల్‌గూడ ఓఆర్‌ఆర్ నుంచి పరిగి మండలం చిట్యాల వరకు చేపడుతున్న రేడియల్‌రోడ్డు సర్వేను సోమవారం మండలంలోని ముట్పూర్, చుక్కమెట్టు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తమ పొలాలను తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా సర్వేచేస్తే ఊరుకునేదిలేదన్నారు. హెచ్‌ఎండీఏ అధికారులు, సర్వే సిబ్బందిని సర్వే చేయకుండా నిలువరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అజాంఅలీ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించినా ఫలితం లేకపోయింది. తాతల కాలం నుంచి సాగుచేసుకొని జీవనం సాగించే తమ భూములను లాక్కుంటే ఎలా బతకాలని నిలదీశారు. పరిహారం తేల్చకుండా సర్వే చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్లారు.
ప్రకృతి వ్యవసాయానికి
మద్దతు ఇవ్వాలి
కడ్తాల్: విత్తన జాతుల మధ్య జన్యుమార్పిడిపై పూర్తి నిషేధం విధించాలని, మొక్కల రకాలపై స్థానిక సమాజలకుండే హక్కులను కాపాడాలని కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీజీఆర్ పర్యావరణ సంస్థ, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక విత్తన పండుగ ముగింపు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలపై సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బయో పైరసీని నిరోధించా లని, వాణిజ్య పంటల కంటే స్థానికంగా తగిన పోషకాహార పంటలకు ప్రాధాన్యతనిస్తూ ప్రకృతి వ్యవసాయానికి మద్దతునివ్వాలని పేర్కొంది. విత్తన, జీవావరణ పద్ధతులతోనే జీవవృద్ధి చెందుతుందని, వాటి పునరుజ్జీవ కార్య క్రమాల నిర్వహణకు తమ మద్దతు ఉంటుందని విత్తన పండుగలో రైతులు, పర్యావరణ వేత్తలు, విద్యావేత్తలు, స్వచ్చంధ సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని వివరించింది.
అన్యాయాలపై ప్రశ్నించే గొంతుక మజ్లిస్
షాద్‌నగర్: ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించే గొంతుక మజ్లిస్ పార్టీ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి గౌస్ సోమవారం పట్టణంలోని 1వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వాలను ఎంఐఎం పార్టీ నిలదీస్తుందని అన్నారు. ఎంఐఎంకు అండగా నిలబడి గౌస్‌ను గెలిపించాలని కోరారు.
ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత


