తీర్మానాల మేరకే బిల్లుల చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

తీర్మానాల మేరకే బిల్లుల చెల్లింపు

Feb 9 2026 8:51 AM | Updated on Feb 9 2026 8:51 AM

తీర్మానాల మేరకే బిల్లుల చెల్లింపు

తీర్మానాల మేరకే బిల్లుల చెల్లింపు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీలకు నిధుల వరద పారుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాకు తొలి విడతలో రూ.11.10 కోట్లు మంజూరయ్యాయి. సోమవారం రెండో విడత నిధులు మంజూరు కానున్నాయి. మరో పదిహేను రోజుల్లో మూడు, నాలుగో విడత నిధులు సైతం మంజూరయ్యే అవకాశం ఉంది. పాలక మండళ్లు లేక రెండేళ్లగా నిధులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.32 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అంచనా. కొత్త పాలక మండళ్ల తీర్మానం ద్వారానే ఈ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆయా పంచాయతీల్లో పాలకమండళ్లు ప్రత్యేకంగా సమావేశమై నిధుల ఖర్చుపై చర్చించనున్నాయి.

526 జీపీలు.. రూ.11.10 కోట్లు

జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా, ఒకటి మినహా మిగిలిన వాటికి ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం నుంచి తొలి విడత నిధుల మంజూరులో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని 14 పంచాయతీలకు రూ.39.53 లక్షలు, ఆమనగల్లు పరిధిలోని 13 పంచాయతీలకు రూ.22.77 లక్షలు, చేవెళ్ల పరిధిలోని 25 గ్రామాలకు రూ.49.20 లక్షలు, ఫరూఖ్‌నగర్‌ పరిధిలోని 47 గ్రామాలకు రూ.82.55 లక్షలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని 14 గ్రామాలకు రూ.46.23 లక్షలు, చౌదరిగూడ మండలంలోని 24 గ్రామాలకు రూ.43.94 లక్షలు, కడ్తాల్‌ పరిధిలోని 24 గ్రామాలకు రూ.50.56 లక్షలు, కందుకూరు పరిధిలోని 35 గ్రామాలకు రూ.75.75 లక్షలు, కేశంపేట పరిధిలోని 29 గ్రామాలకు రూ.59.31 లక్షలు, కొందుర్గు మండలంలోని 22 గ్రామాలకు రూ.40.05 లక్షలు, కొత్తూరు పరిధిలోని 12 గ్రామాలకు రూ. 28.22 లక్షలు, మాడ్గుల పరిధిలోని 34 గ్రామాలకు రూ. 67.92 లక్షలు, మహేశ్వరం పరిధిలోని 30 గ్రామాలకు రూ.60.18 లక్షలు వచ్చాయి. మంచాల మండలంలోని 23 గ్రామాలకు రూ. 62.72 లక్షలు, మొయినాబాద్‌ పరిధిలోని 19 గ్రామాలకు రూ.38.87 లక్షలు, నందిగామ పరిధిలోని 19 గ్రామాలకు రూ.43.78 లక్షలు, షాబాద్‌ పరిధిలోని 41 గ్రామాలకు రూ.71.25 లక్షలు, శంషాబాద్‌ పరిధిలోని 21 గ్రామాలకు రూ.45.45 లక్షలు, శంకర్‌పల్లి పరిధిలోని 24 గ్రామాలకు రూ.53.18 లక్షలు, తలకొండపల్లి పరిధిలోని 32 గ్రామాలకు రూ.58.37 లక్షలు, యాచారం పరిధిలోని 24 గ్రామాలకు రూ.68.57 లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల్లేక మధ్యలో వదిలేసిన పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పనుల ప్రాధాన్యతను బట్టి 15 రోజుల్లోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఈ–గ్రామ స్వరాజ్‌ పోర్టర్‌లో నమోదు

ఈ బిల్లుల చెల్లింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచించింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులు, వాటి బిల్లుల చెల్లింపు సహా కొత్తగా చేపట్టే పనులకు సంబంధించిన వివరాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేసి ఈ–గ్రామ స్వరాజ్‌ పోర్టర్‌లో నమోదు చేయాలని సూచించింది. పనుల పూర్తి, నిధుల చెల్లింపుపైనే అధనపు నిధుల మంజూరీ ఆధారపడి ఉందని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌ స్పష్టం చేశారు. నిధుల చెల్లింపు, ఖర్చులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిందిగా సూచించారు.

నేడు పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు

15వ ఆర్థిక సంఘం నిధులపై చర్చ

ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు

మధ్యలో నిలిచిన, కొత్త వాటిపై చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement