పురం.. పిరం!
అంచనాలు మించుతున్న ఖర్చు
సాక్షి, రంగారెడ్డిజిల్లా/హుడాకాంప్లెక్స్: పురఎన్నికలు ఖరీదయ్యాయి.. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచార పర్వం మొదలవడంతో అభ్యర్థుల ఖర్చు అంచనాలు మించిపోతోంది.. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచితీరాలనే సంకల్పంతో అభ్యర్థులు ఎంతైనా వెచ్చించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. మెజార్టీ అభ్యర్థులు సంపన్నులే అయినప్పటికీ.. చేతిలో ఉన్న కొద్దిపాటి నగదు నామినేషన్‌కు ముందే ఖర్చవడంతో నిధుల వేటలో నిమగ్నమయ్యారు.
అయినవారి వద్ద ఆస్తుల కుదువ
ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎల్బీనగర్, మీర్‌పేట, బడంగ్‌పేటలోని బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను ఆశ్రయిస్తున్నారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్ బరిలో నిలిచిన వారు నార్సింగి, మణికొండ, కోకాపేట్, రాజేంద్రనగర్ పరిసరాల్లోని తెలిసినవారిని కలుస్తున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆరాంఘర్, అత్తాపూర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల పంచన చేరుతున్నారు. వీరిలో కొంత మంది ప్లాట్లు, ఇళ్లు, బంగారు ఆభరణాలు అమ్ముకుంటుండగా, మరికొందరు ఆస్తులను కుదువపెడుతున్నారు. బ్యాంకుల్లో అప్పు చేస్తే లెక్క చెప్పాల్సి వస్తుందనే భయంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ఎలాగైనా గెలవాలని..
జిల్లాలో ఎన్నికలు జరిగే ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డుల్లో 437 మంది పోటీలో ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి 109 మంది, బీఆర్‌ఎస్ నుంచి 122, అధికార కాంగ్రెస్ నుంచి 126 మంది బరిలో నిలిచారు. వీరు కాకుండా బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జనసేన, ఎంఐఎం, ఇతర పార్టీలతో పాటు మరో 57 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో వీరంతా ఆయా వార్డుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేయగలడు అనే అంశాన్ని ముందు నిర్ధారించుకున్న తర్వాతే అధికార, ప్రతిపక్ష పార్టీలు బీ ఫారాలు చేతికిచ్చాయి. కానీ అప్పటికే సమకూర్చుకున్న నగదు చాలా వరకు ఖర్చవడంతో గెలుపు కోసం ఎంత ఖర్చుకై నా సిద్ధపడుతున్నారు.
నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
నామినేషన్‌కు ముందు రోజే ప్రత్యేక అకౌంట్‌ను తెరిచి రోజువారీ ఖర్చులను ఈ ఖాతా నుంచే చెల్లించాల్సి ఉంది. ఏఒక్క అభ్యర్థి దీన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ప్రత్యేక అబ్జర్వర్లు, నిఘా బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేదు. మున్సిపాలిటీ ప్రధాన రాహదారులపై పోలీసు పికెట్లు పెట్టి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నా ధన ప్రవాహాని మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మరి ఇంత చేస్తున్నా విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.
అప్పుడే మొదలైన ధన ప్రవాహం
నిజానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.లక్షకు మించకూడదు. క్షేత్రస్థాయిలో కరపత్రాలు, వాల్ పోస్టర్లు, ప్రచార సామగ్రి కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచారపర్వం మొదలు కావడం, జెండాలు పట్టి ప్రచారంలో కలిసివచ్చిన కార్యకర్తలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం మద్యం సరఫరాకే రోజుకు కనీసం రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్‌కు ముందురోజు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ఒక్కో ఓటుకు సగటున రూ.2 వేల నుంచి రూ.10 వేలు వెచ్చించేందుకు సైతం వెనుకాడడం లేదని సమాచారం.
పురం.. పిరం!


