దూకుడు ఇక మిగిలింది నాలుగు రోజులే
అనుచరుల గెలుపు కోసం బీఆర్‌ఎస్
మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. జిల్లాలోని మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు తమ అనుచరుల గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు.
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
● ఇప్పటికే ఇన్‌చార్జులను నియమించిన బీఆర్‌ఎస్
● తాజాగా కాంగ్రెస్ జాబితా ప్రకటన
● రంగంలోకి ఇటు ఎమ్మెల్యేలు, అటు ముఖ్య నేతలు
● వేడెక్కిన మున్సిపల్ రాజకీయం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ప్రచారం వేడెక్కింది. ఇటు ఎమ్మెల్యేలు, అటు ఆయా పార్టీల ముఖ్య నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులను వెంటేసుకుని కాలనీలు, అపార్ట్‌మెంట్లు కలియతిరుగుతున్నారు. ఉదయం ఇంటింటా ప్రచారం చేసి, మధ్యాహ్నం పట్టణ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కుల, కాలనీ సంక్షేమ, కార్మిక సంఘాలతో భేటీ అవుతున్నారు. శనివారం పరిగి కేంద్రంగా నిర్వహించే సీఎం బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం చేవెళ్లలో డీసీసీ చీఫ్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
మున్సిపాల్టీలను చుట్టేస్తున్న ఎమ్మెల్యేలు
షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నేత ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అదే వార్డుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేరుకున్నారు. ఓ ఇంట్లో ఆచారి ఉన్న విషయం తెలిసి ఆయనతో మాటామంతి కలిపారు. ఇద్దరు నేతల కలయికను బీఆర్‌ఎస్ తన పార్టీ సోషల్ మీడియాలో ప్రచారాస్త్రంగా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ కో ఆర్డినేటర్ల నియామకం
బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన అధికార పార్టీ తాజాగా ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఆర్డినే టర్‌ను నియమించింది. ఇబ్రహీంపట్నం కోఆర్డినేటర్‌గా వి.జగదీశ్వర్‌గౌడ్, చేవెళ్లకు ఎన్.భూపతిరెడ్డి, మొయినాబాద్‌కు ఎంఏ ఫయీం, శంకర్‌పల్లికి బొంతు శ్రీదేవి, షాద్‌నగర్‌కు టి.ప్రకాష్‌గౌడ్, ఆమనగల్లు మున్సిపాలిటీకి పి.విజయారెడ్డిని ఇన్ చార్జిలుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలను నియమించింది. వీరంతా ప్రచార రంగంలోకి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మాజీమంత్రి సబితారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్‌నగర్‌లో, మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ అనుచరులకు పార్టీ బీ ఫారాలను ఇప్పించుకోవడంతో పాటు వారి గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ తరఫున బీ ఫారాలు దక్కకపోవడంతో నామినేషన్లు ఉపసంహరించుకున్న ఆశావహులను కూడా కలుపుకుపోయి, అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. ఇక నాలుగు రోజులు మాత్రమే మిగలడంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి.


