స్మార్ట్‌గా దూసుకెళ్తూ
పుర ఎన్నికల్లో
సాంతికేతిక వ్యూహాలు
‘ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి.. ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తా’ అంటూ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థులు ఆకర్షణీయంగా కరపత్రాలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ ప్రచారం చేస్తున్నారు.
షాద్‌నగర్: మున్సిపాలిటీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. చాలా మంది స్మార్ట్ ఫోన్లలో అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగిస్తుండటంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. హామీల కరపత్రాలను తయారు చేసి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల సహాయంతో ప్రతి ఓటరుకు చేరవేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదారులు వార్డుల వారీగా ఉంటే ఓటర్లకు సంబంధించిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూర్చున్న చోటు నుంచే అభ్యర్థులు ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు.
ఓటరు జాబితా చేరవేత
కొంత మందికి ఓటరు జాబితాలో పేరు ఉందోలేదో అన్న విషయం తెలియదు. ఓటు ఎక్కడ వేయాలో అవగాహన ఉండదు. దీంతో ఓటరు జాబితాలతో పాటుగా పోలింగ్ స్టేషన్‌ల వివరాలను వాట్సాప్‌లలో పంపిస్తున్నారు. ఓటు ఏ వార్డులో ఉంది. ఏ కేంద్రంలో ఓటు వేయాలన్న విషయాలను కూడా అభ్యర్థులు ఓటర్లకు వాట్సాప్‌ల ద్వారా ఇప్పటి నుంచే సూచిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు ఇంటర్ నెట్‌లో పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ఆకర్షణీయంగా ప్రచార పత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ పని తీరు చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల బరిలో సామాజిక మాధ్యమాలు హామీలకు వేదికలుగా మారాయి.
ప్రచారంపై పదును పెడుతున్న నేతలు
హామీలకు వేదికలుగా మారిన సామాజిక మాధ్యమాలు
అన్‌లిమిటెడ్ డేటాను
సద్వినియోగం చేసుకుంటున్న నేతలు


