పాలనలో పైచేయి | - | Sakshi
Sakshi News home page

పాలనలో పైచేయి

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

పాలనలో పైచేయి

పాలనలో పైచేయి

షాద్‌నగర్‌ మున్సిపాలిటీ ప్రస్థానం

37 ఏళ్లు పాలించిన ఒకే కుటుంబం

మొదట మున్సిపాలిటీగా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మేజర్‌ గ్రామ పంచాయతీగా ఎన్నెన్నో మలుపులు చూసింది. తిరిగి మున్సిపాలిటీగా మారి మూడో విడత ఎన్నికలను చూస్తోంది. పాలన ప్రస్థానంలో షాద్‌నగర్‌ చరిత్ర ఇది..

షాద్‌నగర్‌: స్వాతంత్య్రం అనంతరం పాలన వ్యవస్థ ఏర్పాటయ్యాక 1952లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నారాయణపేట కాగా, మరొకటి షాద్‌నగర్‌, మొదటి మున్సిపల్‌ చైర్మన్‌ మాదిరాజు సుదర్శన్‌రావు పని చేశారు. 1959లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాని హోదాలో ఇక్కడికి వచ్చి పంచాయతీ వ్యవస్థను రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. దేశంలోనే షాద్‌నగర్‌ రెండో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ. ఈ క్రమంలో షాద్‌నగర్‌ను మేజర్‌ పంచాయతీగా గుర్తించారు. అప్పటినుంచి 2011 వరకు గ్రామపంచాయతీగా కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి కృషితో షాద్‌నగర్‌ 2011లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. రెండేళ్ల పాటు అధికారుల పాలనలో కొనసాగింది. 2014లో జరిగిన మొదటిసారి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అగ్గనూరు విశ్వం మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2020లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా కొందూటి నరేందర్‌ బాధ్యతలు చేపట్టారు.

ఆ కుటుంబానిదే ఆధిపత్యం

అగ్గనూరు రాచప్ప కుటుంబంలో ఇప్పటివరకు ముగ్గురు పట్టణాన్ని పాలించారు. తండ్రి అగ్గనూరు రాచప్ప, కొడుకు అగ్గనూరు విశ్వం, కోడలు అగ్గనూరు విశాలలు సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు చేపట్టారు. షాద్‌నగర్‌ గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ పాలనలో ఇప్పటివరకు 67 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే అందులో అగ్గునూరు కుటుంబ సభ్యులు షాద్‌నగర్‌ను 37 ఏళ్ల పాటు పరిపాలించడం విశేషం. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో అగ్గనూరు కుటుంబం ప్రత్యేకమైన ముద్రను కనబరుస్తూ వస్తుంది.

ఎప్పుడు గెలిచారంటే..

● 1964–1980 వరకు షాద్‌నగర్‌ తొలి సర్పంచ్‌గా అగ్గనూరు రాచప్ప ఎన్నికయ్యారు.

● 1988లో జరిగిన ఎన్నికల్లో తిరిగి రాచప్ప సర్పంచ్‌గా గొలుపొందారు.

● షాద్‌నగర్‌ పంచాయతీ సర్పంచ్‌ పదవికి 1990లో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఆకుల మాణయ్య సర్పంచ్‌గా గెలుపొందారు.

● 1995లో జరిగిన ఎన్నికల్లో అగ్గనూరు విశ్వం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

● 2008 ఎన్నికల్లో అగ్గనూరు విశాల సర్పంచ్‌గా గెలుపొందారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యే వరకు అంటే 2011 ఆగస్టు 24 వరకు పదవిలో కొనసాగారు.

● 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అగ్గనూరు విశ్వం కౌన్సిలర్‌గా ఎన్నికై చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement