గ్రామీణ ‘పురపాలిక’ | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ‘పురపాలిక’

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

గ్రామీణ ‘పురపాలిక’

గ్రామీణ ‘పురపాలిక’

మొయినాబాద్‌: పురపాలిక అంటే ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు, సిమెంటు రోడ్లు, ఒకదానికొకటి కలిసిపోయిన కాలనీలు, వ్యాపార సముదాయాల సమూహమని అందరూ అనుకుంటారు. నిజమే పురపాలికలు అంటే అలాగే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఏడాది క్రితం కొత్తగా ఏర్పడిన మొయినాబాద్‌ మున్సిపాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పురపాలికగా ఏర్పడినా ఇంకా ఇక్కడ గ్రామీణ వాతావరణమే కనిపిస్తోంది. హైదరాబాద్‌ మహానగరానికి అతి చేరువలో ఉండి గ్రామీణ వాతావరణంలో కొనసాగుతున్న మొయినాబాద్‌ పురపాలికపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

111 జీవో అమలు

మొయినాబాద్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని ప్రశాంతమైన వాతావరణం. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతం క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఉండటం. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌(గండిపేట), హిమాయత్‌సాగర్‌ల మధ్యలో మొయినాబాద్‌ మున్సిపాలిటీ ఉంది. జలాశయాల ఎగువ ప్రాంతంలో పది కిలోమీటర్ల దూరం వరకు 111 జీవో అమలులో ఉండటంతో ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు నిషేధం. అందుకే ఈ ప్రాంతం నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కాంక్రీట్‌ జంగల్‌గా మారలేదు.

ఏడాది క్రితం మున్సిపాలిటీ ఏర్పాటు

ఏడాది క్రితం కొత్తగా మొయినాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పడింది. మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీలు(మొయినాబాద్‌, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్‌నగర్‌, అజీజ్‌నగర్‌, ఎనికేపల్లి, ముర్తూజగూడ, సురంగల్‌)లను విలీనం చేసి మొయినాబాద్‌ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 74.56 చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ జనాభా 27,653 మంది. మండలంలో 10,017 ఎకరాల సాగుభూమి ఉండగా 8,009 మంది రైతులు ఉన్నాట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ తిరుపతిగా ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం ఈ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది.

తొమ్మిది గ్రామాలు విలీనం

మున్సిపాలిటీగా ఏర్పడినా ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలోనే ఉంది. విలీనమైన 9 పంచాయతీలతోపాటు రెండు అనుబంధ గ్రామాలు అమీర్‌గూడ, చిన్నషాపూర్‌ దూర దూరంగానే ఉన్నాయి. మొయినాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంతో ఏ ఒక్క గ్రామం పూర్తిగా కలవలేదు. మొయినాబాద్‌ నుంచి పెద్దమంగళారానికి ఒక కిలోమీటర్‌, చిలుకూరు రెండు కిలోమీటర్లు, అప్పోజీగూడ నాలుగు కిలోమీటర్లు, హిమాయత్‌నగర్‌ మూడు, అజీజ్‌నగర్‌ ఐదు, ఎనికేపల్లి నాలుగు, ముర్తూజగూడ రెండు, సురంగల్‌ మూడు, అమీర్‌గూడ ఒక, చిన్నషాపూర్‌ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మున్సిపాలిటీలోని గ్రామాలన్నీ దూరం దూరంగానే ఉండటంతో అన్ని వేర్వేరు గ్రామాలుగానే కనిపిస్తాయి.

ఫాంహౌస్‌లు అధికం

విలీనమైన అన్ని గ్రామాల్లో వ్యవసాయం కొనసాగుతోంది. యాభై శాతం మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా పూలు, కూరగాయాలు, ఆకు కూరలు, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. గ్రామాల్లో పచ్చని పంటపొలాలు, పూలతోటలు కనువిందు చేస్తుంటాయి. ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌లు అధికంగానే ఉన్నాయి. కొన్ని ఫాంహౌస్‌లు విందులు, వేడుకలకు వేదికలుగా నిలుస్తుంటే.. వ్యవసాయ క్షేత్రాల్లో మాత్రం పండ్లతోటలు దర్శనమిస్తాయి.

పన్నులు పెరిగాయి

మున్సిపాలిటీ చేయడంతో ఎవరికి లాభమో తెలియదుగాని.. మేము మాత్రం వ్యవసాయమే చేసుకొని బతుకుతున్నాం. మాకు పన్నుల భారం పెరిగింది. గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఏ పనికై నా మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. పంచాయతీ ఉంటే అన్ని పనులు గ్రామంలోనే చేసుకునేవాళ్లం.

– పెద్దింటి స్రవంతి, పెద్దమంగళారం

ప్రయోజనం లేదు

మొయినాబాద్‌ ప్రాంతం పూర్తిగా పట్టణీకరణ జరగలేదు. ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఉంది. మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలన్నీ దూరంగానే ఉన్నాయి. గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేయడంతో పెద్ద ప్రయోజనం ఏమి లేదు. ఇంకో పదేళ్ల వరకు గ్రామ పంచాయతీలుగానే ఉంచి ఆ తరువాత మున్సిపాలిటీ చేస్తే బాగుండేది.

– కమ్మరి శ్రీనివాస్‌చారి, సురంగల్‌

వ్యవసాయమే ఆధారం

మున్సిపాలిటీ ఏర్పాటుతో ప్రజలకేమీ లాభంలేదు. కొందరు ప్రజాప్రతినిధు లు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మొయినాబాద్‌ను మున్సిపాలిటీగా మార్చా రు. హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారికి ఆనుకుని ఉన్న అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ గ్రామాల్లో మాత్రమే వ్యాపార సముదాయాలున్నాయి. మిగతా గ్రామాల్లో వ్యవసాయమే ఆధారం.

– ఎల్గని స్వామి, సురంగల్‌

మొయినాబాద్‌లో నేటికీకొనసాగుతున్న వ్యవసాయం

నగరానికి అతిచేరువలో

ఉన్నా పల్లె వాతావరణమే

గ్రామాలు దూరంగా ఉండడంతో

కనిపించని పట్టణ జాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement