మున్సిపల్.. మిక్చర్
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 3గంటలలోపు తమ బీ ఫాంలను, ఉపసంహరణ చేసుకునే వాళ్లు సైతం 3గంటల లోపు చేసుకోవాల్సి ఉంది. మున్సిపాలిటీలోని 7వ వార్డు రామంతపూర్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండ్లగూడెం శ్రీనివాస్‌కి ఆఖరి నిమిషాల్లో బీ ఫాం చేతికి అందింది. దీంతో ఆయన చివరి పది నిమిషాల్లో ఎన్నికల కేంద్రంలోకి ఉరుకులు పరుగుల మీద వెళ్లి అధికారికి బీఫాం అందజేశారు. ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే మరో అభ్యర్థికి పార్టీ బీఫాం కేటాయించిందని, చివరి నిమిషంలో మార్పు చేసి శ్రీనివాస్‌కి ఇవ్వడంతో జాప్యం జరిగినట్లు తెలిసింది.
ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో మంగళవారం బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫాంలు పంపిణీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎన్నికల ఇన్‌చార్జి రజనీ సాయిచంద్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి వచ్చారు. ఒక్కో వార్డుకు అభ్యర్థులను ప్రకటించి బీఫాంలు అందించారు. 14వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా వస్పుల సాయిలు, వస్పుల సుగుణ నామినేషన్ వేశారు. వస్పుల సాయిలును ప్రకటించి బీఫాం అందిస్తుండగా వస్పుల సుగుణకు చెందిన వర్గీయులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలను ఎత్తి కింద పడేశారు. దీంతో వచ్చిన నేతలు బయటకు వెళ్తుండగా ఓ కార్యకర్త విసిరిన కుర్చీ జైపాల్‌యాదవ్ కాలికి తగిలింది. అక్కడే ఉన్న కొందరు నాయకులు గొడవకు దిగిన కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు.
షాద్‌నగర్: గత మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి పోటీచేసిన గెలుపొందిన అగ్గునూరు విశాల ఈసారి 24వ వార్డు బరిలో నిలిచారు. 23వ వార్డు జనరల్‌కు రిజర్వ్ కావడంతో తన చిన్నమామయ్య కొడుకైన అగ్గునూరు బస్వం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో తాను 24వ వార్డులో తలపడేందుకు సిద్ధమైన ఆమె, 23వ వార్డు బీఫామ్‌ను మరిదికి ఇప్పించారు.
మున్సిపల్.. మిక్చర్
మున్సిపల్.. మిక్చర్
మున్సిపల్.. మిక్చర్


