ధాన్యం కొనుగోళ్లు ఇలా..
కల్లాల్లో ధాన్యం.. రైతుల కళ్లల్లో దైన్యం
కలెక్టర్ ఆదేశించినా కదలని వైనం
50 రోజులుగా కొనసా..గుతున్న కొనుగోళ్లు
తొలిసారి మృగశిరలోనూ వడ్ల సేకరణ
ఇప్పటికే 3.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
కల్లాల్లో మరో 40వేల టన్నులు
వానాకాలం వచ్చే..
ఇది వేములవాడ మండలం లింగంపల్లిలో జూన్ 8వ తేదీ సాయంత్రం 4.30 గంటలు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఇతర జిల్లా అధికారులతో కలిసి లింగంపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జూన్ 7వ తేదీ రాత్రి వర్షం పడడంతో వడ్లకుప్పలు తడిసిపోయాయని తెలియగానే కలెక్టర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన వడ్లబస్తాలను పరిశీలించారు. వెంటనే లారీలను సరఫరా చేసే కాంట్రాక్టర్‌తో రైతు సమక్షంలోనే ఫోన్‌లో మాట్లాడి లారీలను సమకూర్చాలని కోరారు. రెండు రోజుల్లో లింగంపల్లిలో ధాన్యాన్ని తూకం వేయాలని, తడిసిన వడ్లను సైతం కొనాలని, పూర్తి స్థాయిలో వడ్లను తరలించి, ఇక్కడ కొనుగోళ్లను ముగించాలని అధికారులను ఆదేశించారు.
ఇతను కటుకం రవి. వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన రవికి మూడెకరాల పొలం ఉంది. నెల రోజుల కిందటే పొలాన్ని కోసి వడ్లను ఎండబెట్టి.. తూకం వేసేందుకు కొనుగోలు కేంద్రంలో పోశారు. వర్షాలు పడినా వడ్లు తడవకుండా టార్పాలిన్ కప్పారు. తేమ శాతం వచ్చినా లారీలు రాక తూకం వేయడం లేదు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ లింగంపల్లికి వచ్చి స్వయంగా వడ్లను పరిశీలించి తూకం వేయాలని అధికారులను ఆదేశించి నాలుగు రోజులైనా ఇప్పటికీ వడ్లు కదలలేదు.
సిరిసిల్ల: జిల్లాలో యాభై రోజులుగా వడ్ల కొనుగోళ్లు సాగుతూ..నే ఉన్నాయి. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తికాలేదు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్ పెట్టారు. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతుండగా, అదనపు కలెక్టర్ రైస్ మిల్లులను, కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో 50 రోజులుగా కొనుగోళ్లు కొనసా..గుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 23న కొనుగోళ్లు ప్రారంభించగా వర్షాకాలం(మృగశిరకార్తె ప్రవేవించినా) ప్రారంభమైనా ముగించలేదు. గతేడాది యాసంగి(రబీ)లో జూన్ 8న పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేశారు. 243 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,73,639.604 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.724.84 కోట్లను రైతుల ఖాతాల్లో జమవేశారు. ఈ ఏడాది ఇంకా కొనుగోళ్లు పూర్తి కాలేదు.
ఈ ఏడాది యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ప్రణాళికను అమలు చేయడంలో జాప్యమైంది. ఏప్రిల్ మొదటి వారంలోనే వరి కోతలు మొదలైనా.. 23వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో రైస్‌మిల్లులకు, గోదాములకు తరలించేందుకు జీపీఎస్ విధానం అమలు చేయాలని పౌరసరఫరాల అధికారుల నిబంధనలు ఉన్నాయి. దీంతో లారీలు దొరక్క.. జీపీఎస్ అమలు కాకపోవడంతో పది రోజులు ఆలస్యమైంది. మే మొదటి వారంలో ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి పెరగడంతో జిల్లా అధికారుల ఉరుకులు పరుగులతో ట్రాక్టర్లు, వ్యాన్లలోనూ వడ్లను తరలించారు. ఆరంభంలో జరిగిన జాప్యం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.
గన్నీ బ్యాగులు, హమాలీలు లేక.. లారీలు రాక.. రైతులు ఆగమవుతున్నారు. బస్తా ధాన్యం బరువు 40 కిలోలు కాగా.. గన్నీ సంచి బరువు 600 గ్రాములు. 40.600 కిలోలు తూకం వేయాల్సి ఉండగా.. తరుగు పేరిట 43 నుంచి 44 కిలోల వరకు తూకం వేస్తున్నారు. మరోవైపు లారీల డ్రైవర్లు ఒక్కో బస్తాకు రూ.3 అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హమాలీ చార్జీల పేరిట క్వింటాలుకు రూ.10 వసూలు చేస్తున్నారు. చివరికి తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ‘కటింగ్’ పేరిట దోచుకుంటున్నారు.


