సిరిసిల్లటౌన్: మున్సిపల్ సాధారణ సమావేశాన్ని మరోసారి వాయిదా వేశారు. ఈమేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో నిర్వహించాల్సిన మున్సిపల్ సమావేశం స్థానిక కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతిచెందగా సంతాప సూచకంగా వాయిదా వేశారు. గురువారం ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన్ జిందం కళ అధ్యక్షతన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా చైర్‌పర్సన్ జిందం కళ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో సమావేశానికి రాలేని పరిస్థితిలో వాయిదా వేసినట్లు కమిషనర్ వివరించారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో లక్ష్మీనారాయణ సూచించారు. మండలంలోని పెద్దలింగాపూర్, దాచారం కేంద్రాలను గురువారం అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ఉండే మహిళా కూలీలను ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం మండల పరిషత్‌లో మండల అభివృద్ధి అధికారి శశికలతో మాట్లాడారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, ఏపీవో చంద్రయ్య, సీసీలు రామచంద్రం, విఠల్, వీవో కరుణ, గన్నారం నర్సయ్య పాల్గొన్నారు.
చందుర్తి(వేములవాడ): మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డు జిల్లా మేనేజర్ దిలీప్ కోరారు. మండలంలోని ఎన్గల్‌లో ప్రతిమ ఫౌండేషన్, జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలపాటు నిర్వహించిన శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నాబార్డ్ జిల్లా మేనేజర్ దిలీప్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. సర్పంచ్ అసనిపర్తి శోభారాణి–సుధాకర్, ఉపసర్పంచ్ మ్యాకల జలంధర్, వార్డు సభ్యులు మోకిలే లహరి, జీఎంఆర్ ప్రిన్సిపాల్ మహేశ్, ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రాం హెడ్ కౌశిక్, మేనేజర్ గీతారెడ్డి, శ్రీలత, పరమేశ్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
జీపీ తాళం తీయించిన అధికారులు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో నూతన గ్రామపంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ వేసిన తాళాన్ని అధికారులు గురువారం తీయించారు. తనకు రూ.1.50 లక్షల బిల్లు రావాలంటూ పనులు చేసిన అండెం మల్లారెడ్డి బుధవారం తాళం వేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పత్రికల్లో రావడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో పంచాయతీరాజ్ ఏఈ అంజయ్య, ఎంపీవో ఆరిఫ్‌పాషా గ్రామానికి చేరుకుని కాంట్రాక్టర్ మల్లారెడ్డితో మాట్లాడారు. అతనికి రావాల్సిన బిల్లులను తనిఖీ చేశారు. బిల్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. అతనితోనే తాళం తీయించారు. సర్పంచ్ మల్యాల స్వామిదాస్, ఉపసర్పంచ్ వంగపెల్లి శేఖర్, కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు.
చోరీ సొత్తు కొన్నా, అమ్మినా చర్యలు
సిరిసిల్ల: చోరీ సొత్తును కొన్నా.. అమ్మినా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తొలిసారి స్క్రాప్ దుకాణాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీ సొత్తు కొనుగోలు, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించామన్నారు. స్క్రాప్ దుకాణాల యజమానులు అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, చోరీ సొత్తు కొనుగోలు చేయొద్దని సూచించారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్, సర్వీస్ వైర్ కట్టలు, గంభీరావుపేట ఠాణా పరిధిలో 10 మోటార్లు, మూడు కాపర్‌వైర్ బెండలు దొరికినట్లు తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


