● నెట్ రాదు.. సిగ్నల్ అందదు ● గంటల కొద్దీ నిరీక్షణ ● ఇబ్బంది పడుతున్న కూలీలు
గంభీరావుపేట(సిరిసిల్ల): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును వీబీజీరామ్‌జీగా మార్పు చేసి అమలులో పారదర్శకత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పనుల్లో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ముఖం ఆధారిత హాజరు(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) కూలీలతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లకు శాపంగా మారింది. సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదు తలనొప్పిగా మారింది. పలుమార్లు ఫొటో తీసినా అప్‌లోడ్ కాకపోవడంతో కూలీలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో 97,880 జాబ్‌కార్డులు ఉండగా.. ప్రస్తుతం 83,390 మంది కూలీలు పని చేస్తున్నారు.
రోజుకు రెండుసార్లు హాజరు
ఉపాధిహామీ పథకం పనులకు వచ్చే కూలీల హాజరును రోజుకు రెండు సార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం పనికి వచ్చిన వెంటనే కూలీల ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాలి. పని ముగిసిన తర్వాత రెండో సారి ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. రెండు హాజర్ల మధ్య కాల వ్యవధి కనీసం నాలుగు గంటలు ఉండాలి. త్వరగా పని ముగించుకొని వెళ్లాలనుకుంటే కుదరదు. నాలుగు గంటల వ్యవధిలోపల ఫొటో తీసుకోదు. అంతవరకు కూలీలు వేచి ఉండాల్సిందే.
ఏ మాత్రం తేడా ఉన్నా అంతే..
మూడేళ్ల క్రితం వరకు కూలీల హాజరును మస్టర్లలో నమోదు చేసే వారు. పని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత మేట్లు కూలీలతో మస్టర్ల సంతకాలు చేసేవారు. రెండేళ్ల క్రితం హాజరు విధానాన్ని మార్చారు. పనికి హాజరైన కూలీల గ్రూప్ ఫొటో తీస్తే సరిపోయేది. ఇటీవల ప్రతి కూలీ ఫొటోను పని ప్రారంభం, ముగింపు సమయంలో తీయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. కూలీల ఆధార్‌కార్డును అనుసంధానం చేసి కేవైసీ పూర్తి చేశారు. కూలీల ఫొటో, కనుపాపలను స్కాన్ చేశారు. పని హాజరు నమోదు సమయంలో ఫొటోలో చిన్నమార్పు ఉన్నా.. మిస్ మ్యాచ్ అంటూ తిరస్కరణకు గురవుతుంది. వెలుతురు సరిగా లేకపోయినా ఇంటర్నెట్ రాకున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్ల మొబైల్ క్లారిటీ లేకున్నా.. హాజరు నమోదు కావడం లేదు. పనిప్రదేశంలో కూలీలు ఫొటో నమోదుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, లేకుంటే ఆ రోజు హాజరుపడక వేతనం కోల్పోవాల్సి వస్తోందనే ఆవేదన కూలీల్లో వ్యక్తమవుతోంది.


