3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే | YSRCP leaders YV Subba Reddy, Mithun Reddy On Delimitation | Sakshi
Sakshi News home page

3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే

Apr 17 2026 5:13 AM | Updated on Apr 17 2026 5:13 AM

YSRCP leaders YV Subba Reddy, Mithun Reddy On Delimitation

కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, సీమకు సరైన ప్రాధాన్యం దక్కాల్సిందే.. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత 

ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోం.. సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది 

చరిత్రాత్మక మహిళా బిల్లును స్వాగతిస్తున్నాం 

వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలి. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత ఉంటుంది.  సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి..’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్‌ బిల్లు కారణంగా ఏపీలో ఒక్క సీటు తగ్గినా, రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38 స్థానాలకు  పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకూ సరైన విధంగా సీట్లు కేటాయింపు జరగకపోతే చూస్తూ ఊరుకోబోమన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యత దక్కాల్సిందేనన్నారు. 

డీలిమిటేషన్‌ వల్ల రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుతోపాటు డీలిమిటేషన్‌ బిల్లు, పునర్విభజన కమిషన్‌ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఇతర ఎంపీలు ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారన్నారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లతోపాటు అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, మహిళల పేరిటే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు లాంటివి మహిళా సాధికారత, సామాజిక హోదా పెంపునకు దోహదపడ్డాయన్నారు.

పొదుపు సంఘాల పునరుజ్జీవం: పీవీ మిథున్‌రెడ్డి
‘వైఎస్సార్‌ ఆసరా/సున్నా వడ్డీ ద్వారా మహిళల రుణాలను మాఫీ చేయడంతోపాటు పొదుపు సంఘాలకు వైఎస్‌ జగన్‌ ప్రాణం పోశారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. అమ్మఒడి ద్వారా పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌దే. సామాజిక న్యాయంలో భాగంగా మహిళల పేరిటే ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి రికార్డు సృష్టించారు.  మహిళల భద్రత కోసం దిశ యాప్‌ ప్రవేశపెట్టి అండగా నిలిచారు’ అని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని గుర్తు చేశారు.

మహిళా భద్రతకు పెద్దపీట: ఎంపీ అవినాశ్‌రెడ్డి
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల్లో 75 శాతం నిధులు మహిళలకే కేటాయించి మహిళా పక్షపాతిగా నిలిచారని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు దిశ యాప్‌ లాంటి వాటితో మహిళా భద్రతకు పెద్దపీట వేశారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్, మునిసిపల్‌ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌దేనని గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించడమే కాకుండా అన్ని రంగాలలో వైఎస్సార్‌సీపీ వారిని  ప్రోత్సహించిందని తెలిపారు.

అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలి. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత ఉంటుంది. మూడు ప్రాంతాల్లో సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. ఏ ప్రాంతానికి నష్టం జరగడానికి వీల్లేదు. ఒక ప్రాంతానికి తగ్గించి.. మరో ప్రాంతానికి పెంచితే అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది.

లక్షల మంది మహిళలకు ఇళ్లు: ఎంపీ గురుమూర్తి
రాష్ట్రంలో 33 లక్షల మంది మహిళల ఇంటి కల నెరవేర్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే అని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గూడు లేక అవస్థ పడుతున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందచేసి అండగా నిలిచారన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో న్యాయం చేసింది జగన్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలకు ఎల్లప్పుడూ మంచి చేసే ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనన్నారు. మహిళా రిజర్వేషన్లపై టీడీపీది కపట నాటకమని దుయ్యబట్టారు. టీడీపీ అధిష్టానం మహిళలను గ్యాలరీలో కూర్చోబెట్టి ప్రేక్షక పాత్రకే పరిమితం చేసిందని విమర్శించారు.

మహిళలకు పదవులు వైఎస్‌ జగన్‌ చలవే: ఎంపీ డాక్టర్‌ తనూజారాణి
వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌ మహిళలకు పెద్ద ఎత్తున పదవులు ఇవ్వబట్టే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలకు పదవులు ఇచ్చారని అరకు ఎంపీ డాక్టర్‌ తనూజారాణి చెప్పారు. దళిత మహిళను హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కిందన్నారు. తొలిసారిగా మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి సైతం జగన్‌ హయాంలోనే దక్కిందన్నారు. వైఎస్‌ జగన్‌ నాడు దళిత మహిళలకు పెద్ద పదవులు ఇచ్చారు కాబట్టే ఆయన చలవతో ఇవాళ హోంమంత్రి పదవిలో దళిత మహిళ ఉన్నారని గుర్తు చేశారు. ఎంపీ బైరెడ్డి శబరి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా మహిళలపై దాడులు జరుగుతుంటే బైరెడ్డి శబరి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులే మహిళలను లైంగికంగా వేధిస్తుంటే బైరెడ్డి శబరికి కనపటడం లేదా అని నిలదీశారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకే శబరి లోక్‌సభలో ఇష్టానుసారం మాట్లాడారని విమర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement