ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదాకి ‘నో’! ఇంతకీ ఈసీ ఏం చెప్పిందంటే..

Speed up vaccination in poll bound Five states Says EC to Centre - Sakshi

ఒమిక్రాన్‌ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 

2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్‌ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ.. సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది.

వాయిదా ప్రసక్తే లేదు!
ఒమిక్రాన్‌ విజృంభించే నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అంశం పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, ఈసీని ఉద్దేశించి అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర స్పందిస్తూ.. యూపీ పరిస్థితుల సమీక్ష తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.  ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖతో చర్చలు, ఆయా రాష్ట్రాల్లో పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే సోమవారం చర్చల అనంతరం ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశంలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ పెంచాలంటూ కేంద్రంతో చేసిన సూచనలే అందుకు నిదర్శనం. 

ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌, గోవాలో మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతానికి చేరువైందని, ఉత్తర ప్రదేశ్‌లో 85 శాతం, మణిపూర్‌ పంజాబ్‌లో 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. 

వరుస భేటీలు

ఆరోగ్య కార్యదర్శి కాకుండా.. ఇంకోవైపు ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ దళాలను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు ఆయా విభాగాల హెడ్‌లతో  సమావేశమవుతోంది. అంతేకాదు పంజాబ్‌, గోవా ఎన్నికల్లో డ్రగ్స్‌ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఈసీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది.

చదవండి: PM Modi Mann Ki Baat.. స్వీయ అప్రమత్తతే దేశానికి బలం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top