సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. నిర్బంధంపై సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం. సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు సివిల్ డ్రస్‌లో వచ్చి అరెస్ట్ చేయడమేంటి?. పైగా నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
శ్రీహరి ఉగ్రవాది కాదు.. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు కూడా ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు వింటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్‌పై డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని సజ్జల డిమాండ్ చేశారు.
‘‘అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. నిబంధనలు పాటించని పోలీసులపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు’’ ఈ సందర్భంగా సజ్జల హెచ్చరించారు.


